రేణిగుంట (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: నగరి ఎమ్మెల్యే రోజా, తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడితో పాటు పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో రాజమహేంద్రవరం- తిరుపతి ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. రేణిగుంటకు రావాల్సిన విమానం బెంగళూరుకు మళ్లించారు. విమానంలో రోజాతో పాటు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం విమానం బెంగళూరులో సురక్షితంగా దిగినట్లు రేణిగుంట ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. సాంకేతికలోపాన్ని సరిదిద్దేందుకు కావాల్సిన మెకానిజం రేణిగుంటలో లేనందునే బెంగళూరు తరలించారని వెల్లడించాయి. సమస్యను పరిష్కరించిన తర్వాత విమానం రేణిగుంట చేరుకోనున్నట్లు తెలిపాయి. మరోవైపు విమానం దారి మళ్లింపుపై రోజా స్పందించారు. తామింకా ఫ్లైట్‌లోనే ఉన్నామని.. డోర్స్ ఓపెన్ కావడం లేదని చెప్పారు. ఇంకా సూచనలు రావాల్సి ఉందని విమాన సిబ్బంది చెబుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు.







