పరమ పవిత్రం శ్రావణమాసం

UPDATED 23rd JULY 2017 SUNDAY 10:00 PM

శ్రావణమాసం వచ్చిందంటే చాలు ప్రతీ ఇల్లు దేవాలయాన్నితలపిస్తుంది. నెల రోజుల పాటు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణ వినిపిస్తుంది. శ్రావణంలో చేపట్టే ఎలాంటి దైవ కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు వేదపండితులు. అంత గొప్ప పవిత్రమాసం రేపటి నుంచి (సోమవారం) ప్రారంభం కానుంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు సైతం రానున్నాయి. సనాతన ధర్మంలో (హిందూ) చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవదైన శ్రావణమాసం ఎంతో పవిత్రత కలిగినటువంటిది. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు ఏర్పడింది. ఈ శ్రావణమాసంలోనే వర్షరుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తులలో స్థితికారుడు దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి (భార్య) అయినటువంటి శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణమాసం. వివిధరకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణం. మహావిష్ణువు జన్మనక్షత్రం కూడా శ్రావణనక్షత్రం కావడం, అటువంటి శ్రావణనక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైన మాసం. ఈ మాసంలో చేసే దైవకార్యాలకు ఎంతో శక్తి ఉంటుంది. నెల రోజులు నిష్ట, నియమాలతో పూజలు నిర్వహించినట్లయితే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయనేది భక్తుల ప్రగాఢవిశ్వాసం. 
శ్రావణ మాసంలోని మరిన్ని విశిష్టతలు...
శుక్లపక్ష ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణునువును పూజించినట్లయితే ఎంతో మోక్షం లభిస్తుంది. శుక్లపక్ష పౌర్ణమి, శ్రావణపౌర్ణమి, రాఖీపౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షాబంధనం జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ, వేదభ్యాసాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది. కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన లాంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణమాసంలోనే కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, గోవులను పూజించడం వంటి ముఖ్య పండుగలు సైతం శ్రావణమాసంలో రావడం శ్రావణమాసానికున్న ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ మాసంలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు, తూచాతప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయంటున్నాయి మన పురాణాలు. 
శివారాధనకు ఎంతో విశిష్టత కలిగిన మాసం..
శ్రావణమాసంలోని దక్షిణయానంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు కూడా విశిష్టమైన మాసం. శ్రావణమాసం ముఖ్యంగా భగవారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ మాసంలో చేసే ఏ చిన్నకార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుంది. ఈ మాసంలో సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు జరిపినట్లయితే సకల పాపాలు కూడా నశిస్తాయాని శస్త్ర వచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థాం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా ఉపవాసం ఉండి దీక్షను పూర్తిచేయాలి. అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి సమయంలో పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనేక శుభఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఈ పక్షంలోని ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేదశాస్ర్తాలు చెబుతున్నాయి. భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉటుందంటున్నారు పండితులు. అందుకే శ్రావణమాసంలోని అన్ని సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంటుంది.
మంగళగౌరీ వ్రతం..
శ్రావణమాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గూర్చి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖ శాంతులు, అష్టైశ్వర్యాలు ఉంటాయి.   దీనిని పూర్తి నిష్టతో చేయాలి.
వరలక్ష్మీ వ్రతం... 
శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణమాసంలో మరొక శుక్రవారమైన ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చు. పూజ మండపంనందు నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి శ్రీవరలక్ష్మీదేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ కింది శ్లోకాన్నిపఠించాలి.
   
శ్లోకం : బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే
 
అని పఠిస్తూ తోరణాన్ని చేతికి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను శ్రవణం చేస్తూ ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా మహాశివుడు పార్వతిదేవికి సూచించి సౌభాగ్యం, మాంగల్యబలాన్ని వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
శ్రావణమాసం అన్ని పూజలకు ఎంతో శ్రేష్టం. 
శ్రావణమాసంలో చేసే పూజ కార్యక్రమాలు ఎంతో శ్రేష్టమైనవి. ఈ మాసంలో వచ్చే పండుగలు కాని, ప్రత్యేక రోజులకు గాని పురాణాల్లో గొప్ప స్థానం ఉంది. మహావిష్ణువు, శివుడుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణమాసం. ప్రతి ఒక్కరూ ఈ మాసంలో ఆచరించే నోములు, పూజలకు విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది. భక్తి శ్రద్ధలు, నియమనిష్టలతో ఆచరించే పూజలతో భగవంతుడి కృపకు పాత్రులవుతారు.
ముఖ్యమైన విషయం...
7వ తేదీ రాఖీపౌర్ణమిరోజు రాత్రి చంద్రగ్రహణం ఉంది. కాబట్టి ఆరోజు ఎలాంటి పూజలు చేయకపోవడం మంచిది. ఉదయం 9గంటల వరకు పూజాకార్యక్రమాలు ముంగించుకుని దైవ నామ స్మరణలో ఉంటే శుభం చేకూరుతుంది. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us