UPDATED 19th SEPTEMBER 2026 8:00 PM
పెద్దాపురం ఎంపీడీవో కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ రగడ
టీడీపీ నేతలకు వేదికపై స్థానం కల్పించడంపై విమర్శలు
నేతల ముందే సమస్యలు చెప్పుకోవడానికి ప్రజల భయం.
అధికారుల పేర్లు, వివరాలు విస్మరించిన సమాచార శాఖ.
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, సెప్టెంబర్ 19: కాకినాడ జిల్లా పెద్దాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈనెల 18వ తేదీన నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న"ఒక నెల--ఒక నియోజకవర్గం--నాలుగు పర్యటనలు" కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఈ అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి రాజ్యాంగబద్ధమైన పదవులు లేని రాజకీయ పార్టీకి చెందిన నేతలను వేదికపై కూర్చోబెట్టడం పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రతీ ఒక్కరూ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరీంద్ర ప్రసాద్ తీరును తీవ్రంగా విమర్శించారు.
పెద్దాపురంలో జరిగిన ఈ పీజీఆర్‌ఎస్ సమావేశంలో జిల్లా కలెక్టర్‌తో పాటు వేదికపై తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్, పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబు రాజు ఆసీనులై ఉండటం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే అత్యంత బాధ్యతాయుతమైన అధికారిక ప్రభుత్వ వేదికపై రాజకీయ నేతలకు ఈ విధంగా పెద్దపీట వేయడంపై వివిధ వర్గాల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
భయంతో వెనకడుగు వేస్తున్న ప్రజలు..
ప్రజలు తమ సమస్యలను అధికారుల వద్ద స్వేచ్ఛగా చెప్పుకోవడానికి తీవ్రంగా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. రాజకీయ నాయకులు తమ ఎదురుగా ఉంటే, భవిష్యత్తులో తమ సమస్యలను తెలియజేస్తే వారు ఏ విధంగా స్పందిస్తారోనన్న ఆందోళనతో కొందరు బాధితులు నోరుమెదపలేని స్థితిలో ఉంటున్నారు. నాయకుల ముందే అధికారులకు తమ గోడు వెళ్లబోసుకోవడానికి వెనకడుగు వేస్తుండటంతో, చాలావరకు ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా పోతున్నాయి.
సమాచార శాఖ వైఫల్యం
ఇదిలాఉంటే సమాచార శాఖ జారీ చేసిన అధికారిక పత్రికా సమాచారంలో వేదికపై కూర్చున్న ఆ రాజకీయ నాయకుల పేర్లను ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతేకాకుండా, అదే వేదికపై ఉన్న డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారిణి (Divisional Development Officer) కె. స్వప్న పేరును కూడా అధికారిక ప్రకటనలో పేర్కొనకపోవడం సమాచార శాఖ వైఫల్యానికి నిదర్శనమని స్పష్టమౌతోంది. తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ వివరాలను సమాచార శాఖ అధికారులు విస్మరించారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
ప్రభుత్వంపై వ్యతిరేక ప్రభావం..
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో, ప్రజలకు చేరువ కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను చేపడుతుంటే.. ఇలాంటి అనధికారిక జోక్యంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలు ప్రభుత్వానికి వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎటువంటి రాజ్యాంగబద్ధమైన పదవులు లేని వ్యక్తులను ఇలా ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారిక హోదాలో వేదికపై కూర్చోబెడితే వచ్చే పరిణామాలు, ఇబ్బందికర పరిస్థితులను ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు గమనించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరి ఈ వ్యతిరేకతపై ప్రభుత్వ యంత్రాంగం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.







