UPDATED 18th JUNE 2017 SUNDAY 9:00 PM
కాకినాడ : జిల్లా టిడిపి అధ్యక్షునిగా జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు పేరును ఖరారు చేసినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. గత నెల 22న కాకినాడలో నిర్వహించిన టిడిపి సమావేశంలోనే జిల్లా పార్టీ పెద్దలు రాంబాబు పేరును ప్రకటించారు. తనను జడ్పీ ఛైర్మన్ పదవిలో కొనసాగిస్తేనే.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతానని రాంబాబు భీష్మించారు. పలువురు జడ్పీటీసీ సభ్యులు సైతం రాంబాబుకు మద్దత్తుగా నిలచారు. ఈ దశలో జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక వ్యవహారాన్ని అధినేత చంద్రబాబుకే వదిలేశారు. ఆయన ఇటీవల జిల్లాకు చెందిన మంత్రి రాజప్పతోపాటు, పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించి అధ్యక్షునిగా రాంబాబు పేరును ఖరారు చేశారు. జడ్పీ ఛైర్మన్ పదవిని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్‌కు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ విషయాలను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. రాంబాబు జడ్పీఛైర్మన్‌గా పదవి చేపట్టి వచ్చేనెలకు మూడేళ్లు పూర్తవుతున్నాయి. అదే రోజు ఆయన పదవికి రాజీనామా చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం నవీన్ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటారని చెబుతున్నారు. కోనసీమలోని పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన రాంబాబు టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నారు. 1994-2004 మధ్య కాలంలో నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షునిగా రెండు సార్లు పనిచేశారు. రాంబాబు తల్లి నామన అప్పలనర్సమ్మ మామిడికుదురు ఎంపీపీగా పనిచేశారు. 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పి.గన్నవరం నుంచి అత్యధిక మెజారిటీతో జడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికయ్యారు. పార్టీలో సీనియర్‌గా ఉన్న రాంబాబు సేవలను గుర్తించి అనూహ్యరీతిలో అధిష్ఠానం జడ్పీఛైర్మన్‌గా ఎంపిక చేసింది. అధిష్ఠానం అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తానని, జిల్లా అధ్యక్షునిగా అందరినీ కలుపుకుని టిడిపి బలోపేతానికి కృషి చేస్తానన్నారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలను పార్టీ గెలుచుకునేలా కృషిచేస్తానని ఆయన పేర్కొన్నారు.







