UPDATED 5th AUGUST 2017 SATURDAY 7:00 PM
గండేపల్లి: రాబోయే రోజుల్లో పెట్రోలియం టెక్నాలజీ ఇంజినీర్ల పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఓ ఎన్ జి సి రిటైర్డ్ జనరల్ మేనేజర్ డాక్టర్ జి.ఎస్. రావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో పెట్రోలియం టెక్నాలజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని శనివారం మాట్లాడారు. పెట్రోలియం టెక్నాలజీ ఇంజనీరింగ్ లో రానున్న100 సంవత్సరాల వరకు కృష్ణా, గోదావరి బేసిన్ లో తన ప్రత్యేకతను చాటుకుంటుందని, ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే పెట్రోలియం, పెట్రో కెమికల్స్ కు సంబందించిన ఎన్నో పరిశ్రమలు రానున్నాయని, భవిష్యత్తులో భూగర్భవనరులపై యావత్ ప్రపంచం ఆధారపడి మనుగడ సాగించే తరుణం ఆసన్నమైందని అందుకు ప్రావీణ్యం గల పెట్రోలియం టెక్నాలజీ ఇంజినీర్లకు అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రతీ విభాగంలోనూ ఆయా విభాగాలకు చెందిన నిష్ణాతులైన అధ్యాపకులతో విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాసరెడ్డి, పెట్రోలియం టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ ఆర్. గిరిప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.







