UPDATED 22nd JUNE 2026 12:00 PM
సామర్లకోట, రెడ్ బీ న్యూస్, జూన్ 22 : రాత్రి వేళ.. నిశ్శబ్ద వాతావరణం. కాకినాడ నుంచి వైజాగ్ వైపు యూరియా లోడ్‌తో వెళ్తున్న ఒక గూడ్స్ రైలు సామర్లకోట మండలం ఉండూరు రైల్వే గేటు సమీపానికి వచ్చేసరికి సిగ్నల్ పడలేదు. దాంతో ఇంజన్ లాంగ్ హారన్ కొడుతూ ట్రాక్‌పై నెమ్మదించి, పూర్తిగా ఆగిపోయింది. చీకటిగా ఉన్న ఆ ప్రాంతంలో రైలు ఆగడమే ఆలస్యం.. పొలాల పొదల్లోంచి కొందరు నీడలాంటి మనుషులు బయటకు వచ్చారు. వారు మామూలు దొంగలు కారు.. పక్కా ప్లాన్‌తో వచ్చిన రైలు దొంగలు!
చకచకా సాగిన ఆపరేషన్..
రైలు ఆగింది కొద్ది నిమిషాలే అయినా, దుండగులు క్షణాల్లో రంగంలోకి దిగారు. గూడ్స్ బోగీకి ఉన్న బలమైన తాళాలను క్షణాల మీద పగలగొట్టారు. తలుపులు తెరిచి లోపల ఉన్న యూరియా బస్తాలను ఒకరికొకరు అందిస్తూ చకచకా కిందకు దించేయడం ప్రారంభించారు. ఒకవైపు సమయం తక్కువగా ఉంది, మరోవైపు ఎప్పుడు సిగ్నల్ పడి రైలు కదులుతుందో తెలియదు.. అయినా సరే, గుండె నిబ్బరంతో ఒకటా, రెండా.. ఏకంగా 60 యూరియా బస్తాలను రైలు నుంచి కిందకు దించేసి, ట్రాక్ పక్కనే ఉన్న పొలాల్లోకి చేర్చేశారు.
ట్విస్ట్ ఇచ్చిన రైల్వే సిబ్బంది!
దొంగల ప్లాన్ దాదాపు సక్సెస్ అయిపోయింది.. ఆ బస్తాలను వాహనాల్లోకి ఎక్కించుకుంటే ఇక వారిని పట్టుకోవడం ఎవరి తరం కాదు. కానీ, సరిగ్గా ఇక్కడే కథ అడ్డం తిరిగింది! చీకట్లో జరుగుతున్న ఈ అనుమానాస్పద కదలికలను రైల్వే సిబ్బంది గమనించారు. బోగీ తాళాలు పగిలి ఉండటం చూసి షాక్‌కు గురైన వారు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల ఎంట్రీ.. సీన్ రివర్స్!
సమాచారం అందిన వెంటనే ఆర్‌పీఎఫ్ పోలీసులు సైరన్లు మోగిస్తూ ఘటనా స్థలానికి దూసుకొచ్చారు. పోలీసుల జీపుల లైట్లు, సైరన్ల శబ్దం వినబడటంతో దొంగల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. చేతికి చిక్కిన లాభాన్ని వదిలేసి, ప్రాణాలు దక్కించుకోవడానికి దించిన బస్తాలను దించినట్టు పొలాల్లోనే వదిలేసి చీకట్లోకి పరారయ్యారు.
పోలీసులు వచ్చి చూసేసరికి పొలాల్లో గుట్టలుగా పడి ఉన్న 60 యూరియా బస్తాలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ప్రస్తుతం ఈ 'గ్రేట్ రైలు దోపిడీ' యత్నం వెనుక ఉన్న గూడచారులెవరో తేల్చేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఒక భారీ చోరీ ప్రయత్నం కాస్తా ఫ్లాప్ అయింది!







