UPDATED 25th JULY 2017 TUESDAY 11:30 PM
అన్నవరం: భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి 127వ ఆవిర్భావ దినోత్సవాన్ని శ్రావణ శుద్ధ విదియ మంగళవారం రత్నగిరిపై ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్‌లకు పంచామృతాభిషేకం, ఆయుష్యహోమం, పూర్ణాహుతి, శ్రీసూక్త, పురుషసూక్త జపాలు, నవావరణార్చన, సువాసినీ పూజలు, లింగాష్టకం, పండితులకు ఘన సత్కారం, రథోత్సవం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వేదపండితులు విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, చిర్రావూరి శ్రీరామశర్మ, ఉప్పులూరి సత్యనారాయణ అవధాని, సింహాచలం దేవస్థానం వేదపండితులు కపిలవాయి వేంకటేశ్వర అవధాని, వడ్లమాని వేంకటేశ్వర అవధాని, పశ్చిమగోదావరి జిల్లా బోడపాడుకు చెందిన సత్యనారాయణ అవధాని ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయప్రాకారంలోని మాడావీధుల్లో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఇన్‌చార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







