UPDATED 4th AUGUST 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు అన్నారు. స్థానిక అయోధ్యరామపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆవరణలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా నేషనల్ గ్రీన్ కోర్ ఎ.ఎల్.వి. కుమారి, వ్యాయామ ఉపాధ్యాయులు టి. వైకుంఠం ఆధ్వర్యంలో శనివారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమీషనర్, విద్యా కమిటీ చైర్మన్ సప్పా గంగాభవాని హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచి పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని, మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం అలవర్చుకోవాలన్నారు. పర్యావరణాన్ని కాపాడకపోతే భవిష్యత్తరాలకు ప్రమాదకర పరిస్థితులు ఉంటాయన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, ప్రతీ వస్తువు తిరిగి వినియోగించుకునేలా ఉండాలన్నారు. నీరు వృథా కానివ్వద్దని, ఏ మేర అవసరమో అంతే వాడాలన్నారు. మార్పు అనేది సమాజం నుంచి రావాలన్నారు. మొక్కల సంరక్షణపై విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ, ఉపాధ్యాయులు కెవివి సత్యన్నారాయణ, కె. అరుణ, టి. శ్రీలక్ష్మి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







