Updated 28 January 2022 Friday 07:45 PM
తిరుమల (రెడ్ బీ న్యూస్) : నకిలీ దర్శన టికెట్లతో భక్తులను మోసం చేసిన ఆటోడ్రైవర్ తో పాటు మరొకరిపై తిరుమల విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల టు టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం కాంప్లెక్స్ లోని స్కానింగ్ సెంటర్లో విజిలెన్స్ వింగ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఉన్న పాండిచ్చేరికి చెందిన సి. సుబ్రమణియన్, అతని స్నేహితుల్ని విచారించారు. తిరుపతిలో ఆటో డ్రైవర్ మౌన్ కుమార్, సౌందర్ కలిసి దర్శన టికెట్లు ఇప్పిస్తామని చెప్పారని, ఇందుకోసం ఫోన్ పేలో రూ. 4 వేలు, మరో రూ. 4 వేలు నగదు ఇచ్చామని భక్తులు తెలిపారు. ఈ టికెట్లతో దర్శనానికి వెళ్లగా.. నకిలీ టికెట్లుగా తేలడంతో మోసపోయామని గుర్తించామన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ వింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తిరుమల టు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
మోసం చేస్తే వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం :
సీవీఎస్పీ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు నకిలీ దర్శన టికెట్లతో మోసం చేస్తే వారి వాహనాలను, డ్రైవింగ్ లైసెన్స్ లను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరుస్తామని టీటీడీ సీవీఎస్ వో శ్రీ గోపినాథ్ జెట్టి హెచ్చరించారు. భక్తులు దర్శన టికెట్ల కోసం ఇలాంటి వారిని నమ్మి మోసపోకుండా, అప్రమత్తంగా ఉండాలని కోరారు.







