Miss Universe: విశ్వ సుందరి కిరీటం.. ధర తెలిస్తే షాకే..!

రెడ్ బీ న్యూస్ 17 డిసెంబర్ 2021‌: ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడిస్తూ విశ్వసుందరిగా ఎన్నికయ్యారు హర్నాజ్‌ కౌర్‌ సంధు. పంజాబ్‌కు చెందిన ఈ 21ఏళ్ల చిన్నది.. సరిగ్గా 21ఏళ్ల తర్వాత భారత్‌కు విశ్వసుందరి కిరీటాన్ని తీసుకొచ్చారు. అయితే విశ్వవేదికపై హర్నాజ్‌ ధరించిన ఆ కిరీటం ధర ఎంతో తెలుసా? అక్షరాలా 5 మిలియన్‌ డాలర్లు. అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ.38కోట్లకు పైమాటే. స్విట్జర్లాండ్‌కు చెందిన మౌవాద్‌ అనే జ్యువెల్లరీ సంస్థ విశ్వ సుందరి కిరీటాన్ని రూపొందించింది. ‘పవర్‌ ఆఫ్‌ యునిటీ క్రౌన్‌’ పేరుతో తయారుచేసిన ఈ కిరీటం ధర 5 మిలియన్‌ డాలర్లుగా పేర్కొంది. 18 క్యారెట్ల బంగారం, 1725 తెలుపు వజ్రాలు, 3 గోల్డెన్‌ కెనరీ డైమండ్స్‌తో రూపొందించారు. ఆకులు, తీగల ఆకారంలో రూపొందించిన ఈ కిరీటంలో మధ్య మధ్యలో విలువైన రత్నాలను పొదిగారు. ఖండాలు వేరైనా మన మధ్య బంధం మనల్ని ఐకమత్యంగా ఉంచుతుందని, పరస్పర సహకారంతో సాధికారత సాధించాలన్న అర్థంతో దీన్ని రూపొందించారు. ఇప్పటివరకు ఉన్న విశ్వసుందరి కిరీటాల్లో పరిమాణం పరంగా ఇదే చిన్నది. కానీ, డైమండ్‌ క్యారెట్‌ బరువులో ఇదే పెద్దది కావడం విశేషం. ఈ కిరీటం మధ్యలో మిరుమిట్లుగొలుపుతున్న బంగారు రంగు వజ్రం బరువు 62.38 క్యారెట్లు. అంతేగాక, ఈ 70ఏళ్ల చరిత్రలో అత్యంత ఖరీదైన విశ్వసుందరి కిరీటం కూడా ఇదే. విశ్వసుందరి పోటీలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 9 సార్లు కిరీటాన్ని మార్చారు. ప్రస్తుతం హర్నాజ్‌ ధరించిన ఈ కిరీటాన్ని తొలిసారిగా 2019లో ఉపయోగించారు. అప్పటి నుంచి ఇదే మోడల్‌ను కొనసాగిస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us