విజయనగరం (రెడ్ బీ న్యూస్) 23 డిసెంబర్ 2021: సినిమా టికెట్ ధర సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యం తప్ప.. చిత్ర పరిశ్రమను ఇబ్బందులకు గురిచేయడం కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. నష్టపోయే ప్రమాదం ఉందని భావిస్తే థియేటర్ యజమానులు అధికారులను కలిసి విన్నవించుకుంటే ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటారన్నారు. అంతేతప్ప ఇష్టానుసారం టికెట్ ధరలు పెంచి విక్రయిస్తే ప్రభుత్వం ఒప్పుకోదన్నారు. దేనికైనా ఎమ్మార్పీ ధర ఉంటుందని.. సినిమా టికెట్‌కు మాత్రం ఉండకూడదంటే ఎలా అని బొత్స ప్రశ్నించారు. సినిమా టికెట్ల విషయంలో ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తామంటే కుదరదని బొత్స చెప్పారు. సినిమా అనేది సామాన్యుడికి వినోద సాధనమని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు ధరలు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. సినిమా చేసే వారికి మేలు చేసేందుకే ప్రభుత్వం సినిమా టికెట్లపై నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రంలో పలు సినిమా థియేటర్ల సీజ్‌పైనా బొత్స స్పందించారు. సినిమా థియేటర్లపై కావాలని దాడులు చేయడం లేదని చెప్పారు.







