Updated 26 January 2022 Wednesday 07:30 AM
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్):73వ గణతంత్ర దినోత్సవానికి భారతావని సిద్ధమైంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఈ ఏడాది వేడుకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో మరికొద్దిగంటల్లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌తో గణతంత్ర వేడుకలు ప్రారంభంకానున్నాయి. గణతంత్ర పరేడ్ ఎప్పటిలా ఉదయం 10 గంటలకు కాకుండా ఈసారి అరగంట ఆలస్యంగా పదిన్నర గంటలకు ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ జాతీయ యుద్ధస్మారకం వద్దకు వెళ్లి దేశం తరపున అమర వీరులకు నివాళులు అర్పించిన తర్వాత గణతంత్ర పరేడ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం పరేడ్‌ను వీక్షించేందుకు ప్రధాని, ఇతర ప్రముఖులు రాజ్‌పథ్ చేరుకుంటారు. సంప్రదాయం ప్రకారం… రాజ్‌పథ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం… 21 గన్ సెల్యూట్‌తో జాతీయ గీతం ఆలపిస్తారు.
రాష్ట్రపతి సెల్యూట్ చేసిన తర్వాత పరేడ్ ప్రారంభమవుతుంది. పరేడ్‌లో భాగంగా త్రివిధ దళాలు మార్చ్ నిర్వహిస్తాయి. సైనికులు 1947 నుంచి ఇప్పటివరకు ధరించిన వివిధరకాల యూనిఫాంలతో పాటు ఆయుధాలను ప్రదర్శిస్తారు. అనంతరం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 9 మంత్రిత్వ శాఖలకు సంబంధించి 21 శకటాల ప్రదర్శన ఉంటుంది.







