UPDATED 30th JULY 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు అన్నారు. స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచి పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని, మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం అలవర్చుకోవాలన్నారు. పర్యావరణాన్ని కాపాడకపోతే భవిష్యత్తరాలకు ప్రమాదకర పరిస్థితులు ఉంటాయన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, ప్రతీ వస్తువు తిరిగి వినియోగించుకునేలా ఉండాలన్నారు. నీరు వృథా కానివ్వద్దని, ఏ మేర అవసరమో అంతే వాడాలన్నారు. మార్పు అనేది సమాజం నుంచి రావాలన్నారు. మొక్కల సంరక్షణపై విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మొక్కలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎల్. శ్రీనివాస్, పాఠశాల హెచ్ఎం డి.ఎం.వి. ప్రసాదరావు, కళాశాల ప్రిన్సిపాల్ శారద, పిడి రంగారావు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







