Updated 1st May 2017 Monday 2:00 PM
కాకినాడ: జిల్లాలో నిర్వహణలో ఉన్న అన్ని ఇసుక రీచ్ లలో యంత్రాల వినియోగం పై నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా రెవిన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. కలక్టరేట్ కోర్ట్ హాల్లో జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశంలో కలక్టర్ సోమవారం మాట్లాడారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్దేశాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణం గా ఇసుక రీచ్ లలో ఎక్కడా యంత్రాలను వినియోగించరాదని ఈ నిషేధాన్ని మండల స్థాయి టాస్క్ ఫోర్స్ టీం లు జిల్లాలోని ఇసుక రీచ్ లన్నిటిలో కచ్చితంగా అమలు చేయాలన్నారు. అలాగే రీచ్ లలో ఇసుక లోడింగ్, అన్ లోడింగ్ ప్రక్రియను ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ విధానంలో నిర్వహించాలని ఆదేశించారు. రాంప్ ల వారీగా స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని లోడింగ్, ట్రాన్స్ పోర్ట్ నిర్వహణ చార్జీలను నిర్ణయించే అధికారాన్ని ఆయా సుబ కలెక్టర్ లు, ఆర్డీవో లకు కల్పించామన్నారు. ఈ మేరకు నిర్దేశించిన ధరలను, నియమ నిబంధనలను బోర్డు ల పై రీచ్ లలో ప్రదర్శించాలన్నారు. ఏ రీచ్ లోనూ అవసరానికి మించి ఎక్కువ పరిమాణంలో ఇసుక నిల్వలను ఉంచవద్దని ఆదేశించారు. రెవిన్యూ, పోలీస్, మైనింగ్ , పంచాయతీ సిబ్బంది అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ టీంలు ఇసుక రీచ్ ల పై నిరంతర గట్టి నిఘా ఏర్పాటు చేసి ఇసుక అక్రమ తవ్వకాలు చూడాలని కలక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జె సి -2 జె. రాధాకృష్ణమూర్తి, అర్బన్ అడ్మిన్ ఎస్పీ ఆర్. గంగాధర్, మైనింగ్ ఎడి ఎం. శ్రీనివాస్, డీపీవో టి వి ఎస్ జి కుమార్, జెడ్పి సీఈవో కె. పద్మ, ఆర్డీవోలు విశ్వేశ్వరరావు, గణేశ్వరరావు, ఎల్. రఘుబాబు, కె. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.







