హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పబ్‌లు, బార్లలో వేడుకల సమయాన్ని మరింత పెంచారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దిల్లీ, మహారాష్ట్ర తరహాలో ఆంక్షలు విధించాలని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ నూతన సంవత్సర వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఇప్పటికే పోలీసులు మార్గదర్శకాలు జారీచేశారని గుర్తుచేసింది. పరిస్థితులను బట్టి రాష్ట్రాలు నిర్ణయాలను తీసుకుంటాయని అభిప్రాయపడింది. రాష్ట్రంలో 100శాతం మొదటి డోసు పూర్తయిందని.. రెండో డోసు పంపిణీ కూడా 66 శాతం దాటిందని తెలిపింది. మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేసంది.







