UPDATED 7th AUGUST 2018 TUESDAY 5:30 PM
రంపచోడవరం: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుద్ధ్యం మెరుగుదలకు మిషన్ మోడ్ లో పనిచేస్తున్నాయని, ఆయా అంశాలపట్ల విస్తృత ప్రచారం గావించి మరుగుదొడ్లు వాడకంలోనికి తెచ్చేందుకు స్వచ్ఛ సర్వేక్షణ రధాలు పేరిట గ్రామాలలో అవగాహన కల్పించడం జరుగుతోందని ఐటిడిఎ ఇంచార్జ్ పివో డాక్టర్ వి. వినోదకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కలెక్టరు కార్తికేయమిశ్రా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా జిల్లా గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ రధాలు తిరుగుతూ ప్రచారం గావించడం జరుగుతోందన్నారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై జిల్లాలో గ్రామీణ ప్రాంతాలల్లో నెల రోజుల పాటు పలువురు కళాకారుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. దీనిలో భాగంగా ఐటిడిఎ పరిధిలోని దేవీపట్నం మండలంలో ఇందుకూరు, ఇందుకూరుపేట, దేవీపట్నం, మారేడుమిల్లి మండలం దేవరపల్లి, బోదులూరు, మారేడుమిల్లి, రంపచోడవరం మండలంలో రంపచోడవరం, ఐ. పోలవరం బి. వెలమలకోట గ్రామాల్లోని ప్రదర్శనలు ఇచ్చారన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన విభూది రాజారాం, విభూది కామాక్షి బుర్రకధా బృందాలు ఏజెన్సీలో పర్యటించి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాయన్నారు. జిల్లాలో బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలులో కళాజాతాలు నిర్వహించి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల వాడకం, మొక్కల పెంపకం తదితర కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేస్తూ గిరిజనుల్లో చైతన్యాన్ని తీసుకొని వస్తున్నాయన్నారు. ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించడమే కాకుండా వాటిని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. నీరు-చెట్టు ప్రజల జీవన విధానంతో పరిశుభ్రతకు ప్రాధాన్యంగా మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు, తద్వారా వ్యాదులు నివారించడానికి ప్రభుత్వం తరపున నిర్వహించే ఈ కళాజాతాలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమాలలో గిరిజనులు ఉత్సాహంగా పాల్గొని పరిసరాల పరిశుభ్రత ద్వారా ఆరోగ్యవంతంగా జీవించాలని పివో కోరారు.







