UPDATED 30th MAY 2017 TUESDAY 10:30 PM
కాకినాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 8న కాకినాడ రానున్నారు. వచ్చేనెల 2 నుంచి 8వ తేదీ వరకూ రాష్ట్రంలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా వచ్చేనెల 8న కాకినాడలో నిర్వహించనున్న మహాసంకల్పం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. మంగళవారం కాకినాడ ఆర్ అండ్ బి అతిథి గృహంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రవిప్రకాష్ లతో సమీక్షించారు. మహాసంకల్ప సభ నిర్వహణ, ఇతర అంశాలపై సమీక్షించారు. నవ్యాంధ్రప్రదేశ్ లో ఏటా జూన్ 2న నుంచి నవ నిర్మాణ దీక్ష చేపడుతున్నారని, ఈసారి సీఎం చంద్రబాబు జిల్లాలో నిర్వహించే మహాసంకల్పం కార్యక్రమానికి హాజరౌతున్న నేపథ్యంలో ఇప్పట్నుంచే ఏర్పాట్లు పక్కాగా చేయాలని, జిల్లా అభివృద్ధికి సంబంధించిన పూర్తి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ, ఎమ్మెల్యే ఎ. ఆనందరావు, అసిస్టెంట్ కలెక్టర్ ఒ.ఆనంద్ పాల్గొన్నారు.







