* నో మాస్క్-నో ఎంట్రీ మార్గదర్శకాలు తప్పక పాటించాలి
* జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి
UPDATED 23rd OCTOBER 2020 FRIDAY 8:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘిస్తూ వ్యాపార సంస్థలు నడిపితే సీజ్ చేస్తామని, తప్పులను పునరావృతం చేస్తే లైసెన్సులను కూడా రద్దు చేసేందుకు వెనుకాడబోమని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్‌రెడ్డి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి. లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి. రాజకుమారి, డీఆర్వో సీహెచ్ సత్తిబాబుతో కలిసి ఆయన శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యధిక కేసులను గుర్తించిన జిల్లాగా తూర్పు గోదావరి నిలిచినట్లు పేర్కొన్నారు. కేసులు తగ్గాయనే కారణంతో నిర్లక్ష్యం తగదని, ప్రతీ ఒక్కరూ మాస్కులు ఉపయోగించడం, సామాజిక దూరం పాటించడం, సబ్బుతో చేతులను శుభ్రపరచుకోవడంపై దృష్టి సారించాలన్నారు. కోవిడ్-19పై జిల్లావ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యాయని, 30వ తేదీన ముగుస్తాయని తెలిపారు. లారీ, ట్యాక్సీ, ఆటో, తదితర యూనియన్ల ప్రతినిధులతో పాటు యాజమానుల అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించామని, అలాగే పారిశ్రామిక గ్రూపులతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ఏ రోజుకారోజు క్షేత్రస్థాయి నుంచి నివేదికలు సేకరిస్తున్నామని, అలాగే నిబంధనల ఉల్లంఘనలపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని అన్నారు. అన్ని ఆసుపత్రుల్లోనూ నాన్ కోవిడ్ వైద్య సేవలను పూర్తిస్థాయిలో అందించేందుకు దృష్టి సారించామని చెప్పారు. నవంబర్ 2న పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బందికి కోవిడ్ పరీక్షలు చేయిస్తున్నామని, ఇప్పటికే 14,000 వేల మంది ఉపాధ్యాయులకుగానూ పదివేల మందికి పరీక్షలు పూర్తయినట్లు తెలిపారు.