UPDATED 13th MARCH 2018 TUESDAY 10:00 PM
ఆత్రేయపురం: తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వేంచేసి, కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి తీర్థ, కల్యాణ మహోత్సవాలు సందర్భంగా మంగళవారం ఉదయం పందిరిరాట మహోత్సవం వైభవంగా జరిగింది. అర్చకస్వాముల వేద మంత్రోచ్ఛారణల నడుమ పాలకమండలి ఛైర్మన్ కరుటూరి నరసింహారావు రాటను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే దేవస్థానానికి చెందిన ఏడు ఎకరాల స్థలంలో ఈనెల 20వ తేదీన భూమిపూజ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తీర్థ, కల్యాణ మహోత్సవాలకు ముందుగా జరిగే ద్రవిడ వేద అధ్యయనోత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం మేలుకొలుపు, వేదపారాయణం, ద్రవిడ వేదపారాయణం, తీర్థఘోష్ఠి, నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాదాల వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి పల్లకిసేవ, రాత్రి చెంగోళం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు గోవింద నామ స్మరణతో మార్మోగాయి. భక్తులకు దేవస్థాన అన్నదాన ట్రస్టు ద్వారా అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలక మండలి ఛైర్మన్ కరుటూరి నరసింహారావు, ఈవో ముదునూరి సత్యనారాణరాజు, పాలక మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.







