UPDATED 11th FEBRUARY 2022 FRIDAY 06:00 AM
అమరావతి (రెడ్ బీ న్యూస్): టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్ బాబును ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2022, ఫిబ్రవరి 10వ తేదీ గురువారం అర్ధరాత్రి 12.15 గంటలకు అరెస్టు చేశారు. అశోక్ బాబు ఉద్యోగ సమయంలో విద్యార్హతను తప్పుగా చూపించారని పేర్కొంటూ సీఐడీ ఆయనను అరెస్ట్ చేసింది. పదోన్నతి విషయంలో విద్యార్హత తప్పుగా చూపించారని అశోక్‌బాబుపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐడీ అధికారులు నిన్న రాత్రి ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై టీడీపీ స్పందించింది. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అశోక్‌బాబును సీఐడీ అరెస్ట్ చేసిందని విమర్శించింది.
గతంలో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పని చేసిన సమయంలో అశోక్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగాలపై సీఐడీ కేసు నమోదు చేసింది. తన సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదు చేశారు. డిగ్రీ బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారనే అభియోగాలున్నాయి.







