సూళ్లూరుపేట (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: అమరావతిలో రాజధానికి ప్రధానమంత్రి మోదీ వేసిన పునాది అనాదిగా మిగిలిందని, తిరుపతిని రాజధానిగా చేయాలని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ సూచించారు. సోమవారం సూళ్లూరుపేటలో ఆయన పర్యటించి మాట్లాడుతూ అమరావతి రైతులకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని చెప్పారు. రాజధానికి 1.5 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఏర్పేడు నుంచి రాపూరు వరకు అందుబాటులో ఉందని చెప్పారు. ఇక్కడ రాజధాని ఏర్పాటుచేస్తే 13 జిల్లాలకు అందుబాటులో ఉంటుందన్నారు. కండలేరు, సోమశిల జలాశయాలు ఉండటంతోపాటు, తిరుపతికి ఏడు జాతీయ రహదారుల కలయిక, అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉందన్నారు. మోదీ పరిపాలన అధ్వానంగా ఉందని ఆరోపించారు. నల్లదనం కేంద్రంగా పీఎం కార్యాలయం ఉందని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పతనావస్థలో ఉందన్నారు. దుగరాజపట్నం ఓడరేవు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. శ్రీసిటీ, మేనకూరు, మాంబట్టు, కృష్ణపట్నం ప్రత్యేక ఆర్థిక మండళ్లలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఇచ్చినా సెక్యూరిటీ, వాచ్‌మెన్‌లకు పరిమితం చేస్తున్నారని విమర్శించారు.







