UPDATED 17th OCTOBER 2018 WEDNESDAY 6:00 PM
పెద్దాపురం: స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అంతర్ జిల్లా రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించనున్నట్లు పాఠశాల డైరెక్టర్, టిటి టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ చిట్టూరి విజయప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రావు చిన్నారావు, కార్యదర్శి కె. మోహన్ బాబుతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విజయప్రకాష్ మాట్లాడుతూ పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన టెర్రా ఫ్లెక్స్ మాట్స్ జపాన్ టిటి అకాడమీలో ఈ పోటీలు జరుగుతాయని అన్నారు. ఆరు విభాగాలుగా జరిగే ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలకు చెందిన 350 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు ముఖ్య అతిధిగా అర్జున అవార్డు గ్రహీత జి. జగన్నాధ్, విశిష్ట అతిధులుగా చెంచురామయ్య, కమలేష్ మెహతా నేషనల్ టిటి అబ్సర్వర్, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, బచ్చు ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ బచ్చు కోటేశ్వరావు, ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వి. భాస్కరరామ్, ఎస్.ఎం. సుల్తాన్ పాల్గొని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. బాలుర విభాగంలో మెన్, యూత్ బాయ్స్, జూనియర్ బాయ్స్, సబ్ జూనియర్ బాయ్స్, క్యాడెట్ బాయ్స్, మినీ క్యాడెట్ బాయ్స్, జూనియర్ బాయ్స్ డబుల్స్, సబ్ జూనియర్ బాయ్స్ డబుల్స్, సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్ నేషనల్ తో పాటు బాలికల విభాగంలో విమెన్, యూత్ గర్ల్స్, జూనియర్ గర్ల్స్, సబ్ జూనియర్ గర్ల్స్, క్యాడెట్ గర్ల్స్, జూనియర్ గర్ల్స్ డబుల్స్, సబ్ జూనియర్ గర్ల్స్ డబుల్స్ సింగిల్స్ విభాగంలో జరుగుతాయని, అలాగే మెన్, జూనియర్ బాయ్స్, విమెన్, జూనియర్ గర్ల్స్ టీమ్ ఛాంపియన్ షిప్ విభాగంలో జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు పురస్కారంతో పాటు మెమెంటో, సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో లెఫ్టినెంట్ కమాండర్ కె.ఎస్. రావు, వైస్ ప్రిన్సిపాల్ నీరాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.







