UPDATED 7TH MAY 2017 SAUNDAY 1:00 PM
పెద్దాపురం: ప్రజల సహకారంతోనే పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. స్థానిక వరహాలయ్యపేటలో రూ.ఐదు లక్షలతో కమ్యూనిటి హాలు, రూ. నాలుగు లక్షలతో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం ప్రక్కన కామాక్షి విశ్వబ్రాహ్మణ రిపబ్లిక్ హాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందిస్తున్న ప్రోత్సాహంతోనే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని, ముఖ్యంగా శతాబ్ది పార్క్, రైతు బజార్, ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. అలాగే సామర్లకోట - పెద్దాపురం ప్రధాన రహదారికి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి విస్తరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. హౌసింగ్ స్కీం కింద పట్టణానికి 1760 ఇళ్ళు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పట్టణంలోని రెండు చెరువులను సుందరీకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ఏరియా ఆసుపత్రిని రూ. 5 కోట్లతో మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, మున్సిపల్ కమీషనర్ ఏ. వెంకట్రావు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, కౌన్సిలర్ రాయవరపు వరలక్ష్మి, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, డాక్టర్ తాళాబత్తుల సాయి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.







