UPDATED 5th MAY 2018 SATURDAY 8:00 PM
సామర్లకోట: సాగునీటి కాలువల అభివృద్ధి ద్వారా రైతాంగానికి మేలు జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. స్థానిక ఐదు తూముల వద్ద రూ. 49.87 లక్షలతో నీటిపారుదల శాఖ సాగునీరు కాలువగట్టు అభివృద్ధి పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ సాగునీరు కాలువ గట్లు అభివృద్ధి చేయడం వల్ల నీరు వృధాగా పోకుండా రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. సామర్లకోట కాలువపై స్నానాలు రేవు నుంచి వెస్ట్ ఏలేరు డ్రైన్ క్రాసింగ్ వరకు, సామర్లకోట లాకువద్ద గట్లును పటిష్టపరుస్తున్నట్లు చెప్పారు. నీటిని వృధా చేయకుండా నిల్వ చేసుకోవడం ద్వారా వ్యవసాయానికి ఎంతో మేలు జరుగుతుందని, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, కౌన్సిలర్ మన్యం చంద్రరావు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు(రాము), ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ ఎస్.ఇ ఎన్. కృష్ణారావు, సిఇ విజయకుమార్, ఈఈ అప్పలనాయుడు, డి.ఇ శ్రీనివాస్, ఎ.ఇ అప్పలరాజు, రైతులు, వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.







