UPDATED 6th OCTOBER 2018 SATURDAY 7:00 PM
సామర్లకోట: రాష్ట్రంలో రహదారులు, ఇతర మౌలిక వసతులు అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సామర్లకోట మండలం అచ్చంపేట నుంచి ఉండూరు వెళ్ళే ఆర్ అండ్ బి రోడ్డు అభివృద్ధికి ఎపిడిఆర్.పి నిధులు రూ.5 కోట్లుతో మూడు కిలోమీటర్ల 800 మీటర్లు రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా సదస్సులో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లను అభివృద్ధి చేసి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టి పూర్తిచేయడం జరిగిందని, ఎప్పటినుంచో పెండింగులో ఉన్న అచ్చంపేట, ఉండూరు ఆర్ అండ్ బి రోడ్డు అభివృద్ధికి నేడు శంకుస్థాపన చేశామన్నారు. ఈ రోడ్డు డిసెంబరు నాటికి పూర్తిచేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పన ధ్యేయంగా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఎ. సత్తిబాబు, ఏఎంసి వైస్ చైర్మన్ చిట్టిబాబు, తోటకూర శ్రీనివాస్, రోడ్లు భవనాల శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ ఎం. గోవిందమోహన్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ కె.ఎస్. రాఘవరావు, ఇఇ కె.జి. ప్రకాష్, పర్యవేక్షక ఇంజనీర్ టి.డి. విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.







