UPDATED 2nd JUNE 2022 THURSDAY 08:50 PM
Vikram: విశ్వ నాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’. ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి అప్పుడే బ్లాక్‌బస్టర్ అంటూ రివ్యూ ఇచ్చేశాడు తమిళ హీరో, పొలిటీషియన్ ఉదయ నిధి స్టాలిన్.పలు చిత్రాల్లో కథా నాయకుడిగా నటించిన ఉదయ నిధి స్టాలిన్, అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.
మరోవైపు సినిమా డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ కొనసాగుతున్నారు. విక్రమ్ చిత్రాన్ని ఆయన తమిళనాడులో పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన ఆయన సినిమా ష్యూర్ బ్లాక్‌బస్టర్ అంటూ చెప్పేశాడు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కమల్ హాసన్‌తోపాటు, దర్శకుడు లోకేష్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్‌ను కూడా అభినందించాడు. మరోవైపు ఈ ట్వీట్‌కు కమల్ హాసన్ రిప్లై కూడా ఇచ్చారు. ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ ఇచ్చినందుకు ఉదయ్‌కు కమల్ థాంక్స్ చెప్పారు. ‘‘డియర్ ఉదయ్ తంబి.. ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని మీరు అభిమానిగా చాటుకున్నారు.
మీ రిపోర్ట్ మరెంతో మంది సోదరులకు ఉత్సాహాన్ని ఇస్తుంది’’ అని కమల్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా విక్రమ్ చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. థ్రిల్లర్, యాక్షన్ ప్రధానాంశాలుగా రూపొందిన ‘విక్రమ్’ శుక్రవారం విడుదల కానుంది. తెలుగుతోపాటు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది.







