UPDATED 31st MAY 2022 TUESDAY 07:30 PM
Divyavani Resigns TDP : టీడీపీ నాయకురాలు దివ్యవాణి రాజీనామాపై గందరగోళం నెలకొంది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేసిన దివ్యవాణి.. కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేయడం పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని, తెలుగుదేశం పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
అయితే, కాసేపటికే ఆ ట్వీట్ ను తొలగించారు. అంతేకాదు తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదంటూ యూటర్న్ తీసుకున్నారు దివ్యవాణి.మహానాడులో తనకు మాట్లాడే అవకాశం రాకపోవడంతో దివ్యవాణి అసంతృప్తిగా ఉన్నారు. అదే సమయంలో రవీందర్ రెడ్డి పేరుతో వచ్చిన పోస్ట్ ఆధారంగా తాను రాజీనామా చేశానంటున్నారు దివ్యవాణి. ఇంతలో.. టీడీపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేరుతో దివ్యవాణిని సస్పెండ్ చేసినట్లుగా ఫేస్ బుక్ లో మరో పోస్ట్ పెట్టారు.
ఈ పరిణామాలతో కలత చెందిన దివ్యవాణి.. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించారు. అయితే, తాము దివ్యవాణిని సస్పెండ్ చేయలేదని టీడీపీ తేల్చి చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న దివ్యవాణి తన ట్విట్ ను వెంటనే డిలీట్ చేశారు.
(Divyavani Resigns TDP)2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన దివ్యవాణి.. ఆమెకున్న సినీ గ్లామర్ తో పార్టీలోనూ, ప్రజల్లోనూ మరింత ఇమేజ్ సంపాదించారు. టీడీపీ కూడా ఆమెకు ప్రాధాన్యత కల్పించడంతో ప్రత్యర్థి పార్టీలు, మంత్రులు టార్గెట్ గా ఆమె ఘాటైన విమర్శలు చేశారు. అమరావతి రైతు ఉద్యమం, పాదయాత్రలో సైతం దివ్యవాణి క్రియాశీలక పాత్ర పోషించారు. ఇలాంటి పరిస్థితుల్లో మహానాడులో దివ్యవాణికి మాట్లాడే అవకాశం దక్కలేదు. దీంతో ఆమె అలకబూనారు.







