అమరావతి (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది విశాఖకు 770 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 850 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తుపాను (జవాద్‌గా పిలుస్తున్నారు)గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వాయుగుండం ప్రస్తుతం గంటకు 32 కి.మీ వేగంతో ముందుకు కదులుతోంది. రేపు ఉదయానికి ఉత్తరాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన చెప్పారు. శనివారం ఉత్తరాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంలో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. రేపు ఉదయం నుంచి 70-90కి.మీ వేగంలో బలమైన గాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సోమవారం వరకు చేపలవేటకు వెళ్లరాదని తెలిపారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటి పారుదల మార్గాలను తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.







