UPDATED 19th DECEMBER 2017 TUESDAY 6:00 PM
సామర్లకోట: ప్రజా సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయడంతో పాటు వాటి అమలు సక్రమంగా అమలు జరిగేలా కార్యకర్తలు చూడాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పార్టీ కార్యకర్తలకు సూచించారు. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేటలో మంత్రి విడిది కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నందున నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరతగతిన పూర్తి చేసేలా పర్యవేక్షణ చేయాలన్నారు. పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురం సమీపంలో నిర్మిస్తున్న హౌసింగ్ ఫర్ ఆల్ పథకం నిర్మాణ పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలోనే రానున్నారని ఆయన తెలిపారు. పేదవర్గాల ప్రజలందరికీ ఇళ్ళు మంజూరు చేస్తామని, అయితే గ్రామీణ స్థాయిలో లబ్దిదారులను చైతన్యవంతం చేసి దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు. అలాగే పెండింగ్ సమస్యలను నాయకులను అడిగి తెలుసుకున్నారు. పెద్దాపురం మెయిన్ రోడ్డును రూ. 30 కోట్లతో విస్తరించి దాన్ని అభివృద్ధి చేసేందుకు పనులు చేపట్టామని ఆయన వివరించారు. హౌసింగ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వచ్చేనెలలో జరిగే జన్మభూమి కార్యక్రమాల్లో అన్ని గ్రామాలలో పర్యటిస్తామని చెప్పారు. అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని, దీనిపై గతంలో అందిన ఫిర్యాదులు జన్మభూమిలో పరిష్కారమవుతాయన్నారు. గ్రామాలలో, మండల స్థాయిలలో సమగ్ర అభివృద్ధి సాధించాలంటే సమన్వయంతో అందరూ కలిసి సమిష్ఠిగా పనిచేయాలని సూచించారు. స్థలం ఉన్న లబ్దిదారులకు సబ్సిడీపై లోను మంజూరు చేసి ఇళ్ళు కట్టుకునే పథకం కూడా అమలు జరుగుతోందన్నారు. ఇలా గ్రామాలువారీగా మంజూరు చేసిన ఇళ్ళు త్వరగా కట్టుకోవాలని లబ్దిదారులకు చినరాజప్ప విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పథకాలు అమలులో లోపాలుంటే తన దృష్టికి తీసుకురావాలని, అలాగే పార్టీని గ్రామస్థాయిలో పటిష్టం చేయాలని, క్రమం తప్పకుండా గ్రామ, మండల కమిటీల సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని మంత్రి నాయకులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఏయంసీ ఛైర్మన్ ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి), సామర్లకోట మండల టిడిపి అధ్యక్షులు తోటకూర శ్రీనివాస్, పెద్దాపురం మండల టిడిపి అధ్యక్షులు కోటి, తెలుగుదేశం నాయకులు బొడ్డు బంగారుబాబు, గుమ్మళ్ళ రామకృష్ణ, మన్యం చంద్రరావు, కమ్మిలి సుబ్బారావు, వల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







