నవ్యాంధ్ర నవ నిర్మాణానికి పునరంకితమవుదాం

UPDATED 2nd MAY 2017 FRIDAY 2:00 PM

కాకినాడ : జిల్లాస్థాయి నవనిర్మాణ దీక్షా కార్యక్రమాన్ని శుక్రవారం కాకినాడలోని బాలాజీ చెరువు సెంటర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధ్యక్షత వహించారు. అనంతరం అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు స్పందించి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షా ప్రతిజ్ఞ ఇక్కడ సభాస్థలి వద్ద ఎల్‌ఈడీ తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా అంతా తిలకించారు. ఈ ప్రతిజ్ఞలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి చిన రాజప్ప, రాష్ట్ర శాసన మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రమణ్యం, ఎమ్మెల్సీ లక్ష్మీశివకుమారి, ఎమ్మెల్యే కొండబాబు, జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున, జిల్లా అటవీ అధికారిణి నందిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అవినీతి, కుట్రపూరిత రాజకీయాలతో జరిగిన నష్టాన్ని సమిష్టి కృషితో పూరించుకుందామని, ప్రతీ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలచుకొని స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి దీక్షా బద్ధులమౌదామని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, ఉద్యోగులు ప్రతిజ్ఞ చేసి లక్ష్య సాధనకు సమిష్టిగా పనిచేద్దామన్నారు. నవ నిర్మాణ దీక్షకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రానున్న రెండేళ్లలో మరింత అభివృధ్ధి సాధించటానికి అందరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లాకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయటానికి కృషి జరుగుతోందని, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కూడా త్వరలో సాకారం అవుతుందన్నారు. కాకినాడ-రాజానగరం ఏడీబీ రోడ్డును రూ.225 కోట్లతో విస్తరించనున్నట్లు తెలిపారు. కాకినాడకు రూ.100 కోట్లతో మూడో వంతెన రానుందన్నారు. కత్తిపూడి-గుడిమెల్లంక 216 జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రగతిని గడిచిన మూడేళ్లలో సీఎం చంద్రబాబు ముందుకు తీసుకువెళ్లారని రానున్న రెండేళ్లలో ఎన్నో ఆకాంక్షలు, స్వప్నాలను సాకారం చేయటానికి సమష్టిగా కృషి చేద్దామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ రాష్ట్ర నవనిర్మాణానికి పునరంకింతం కావాలని, రానున్న రెండేళ్లలో జిల్లాను మరింత ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నచోట అభివృద్ధి సాధ్యమౌతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ -2 రాధాకృష్ణమూర్తి, డీఆర్వో జితేంద్ర, తదితరులు  పాల్గొన్నారు. నవనిర్మాణ దీక్షను పురస్కరించుకుని కలెక్టరేట్‌ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో శుక్రవారం నవ నిర్మాణ దీక్షలు ప్రారంభం అయ్యాయి. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ప్రతిజ్ఞలు చేశారు. వీటిన్నింటిని ప్రత్యేక టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా నమోదు చేశారు. దీని కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. 

 

 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us