UPDATED 3rd MAY 2017 SATURDAY 2:00 PM
కాకినాడ: జిల్లా లో జూన్ ఆరవ తేదీ నాటికి అందరికి గ్యాస్ కనెక్షన్లు అందచేసి జిల్లాను పొగ రహిత జిల్లాగా రూపొందించడానికి చర్యలు చేపట్టినట్లు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కాకినాడ కలక్టరేట్ లో దీపం గ్యాస్ కనెక్షన్లు పంపిణీని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జాయింట్ కలెక్టర్ ఎ. మల్లికార్జునతో శనివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 1,36,431 దీపం గ్యాస్ కనెక్షన్లు పంపిణి గత నెల 21వ తేదీ నుంచి ప్రారంభమైందని రాజమహేంద్రవరం డివిజన్ లో 18,330 గ్యాస్ కనెక్షన్లు పంపిణి చేయడం ద్వారా ఆ డివిజన్ లో నూరు శాతం పూర్తయిందన్నారు. అలాగే కాకినాడ, పెద్దాపురం, అమలాపురం, రామంచంద్రాపురం డివిజన్లు ఈ నెల ఆరవ తేదీ నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఏజెన్సీ మండలాల్లో 35 వేల గ్యాస్ కనెక్షన్ల పంపిణి జరుగుతుందని వారికి ఐదు కేజీల సిలిండర్ స్టవ్ పంపిణి జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని పొగరహితంగా తీర్చిదిద్దే ప్రయత్నాలలో భాగంగా ఈ గ్యాస్ పంపిణి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. అలాగే జిల్లాలో రూ.170 కోట్ల వ్యయంతో నీరు చెట్టు పనులు జరుగుతున్నాయని, వీటిలో మట్టి పూడిక తీత పనులను కాలువల్లో నీరు విడుదల చేయడంతో నిలిపి వేయడం జరిగిందని నిర్మాణం పనులు త్వరలోనే కొనసాగుతాయన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలును పారదర్శకంగా చేపడుతున్నామని అవినీతిపరులపై ఫిర్యాదులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.







