UPDATED 25th JUNE 2017 SUNDAY 10:00 PM
వై. రామవరం/రంపచోడవరం : జిల్లాలోని ఏజెన్సీలో మొన్నటి వరకు కాళ్లవాపు మరణాలతో అట్టుడికిన మన్యం తాజాగా వై. రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని చాపరాయి గ్రామంలో వరుసగా 16 మంది గిరిజనులు టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో బాధపడుతూ మృత్యువాత పడిన సంఘటన ఆదివారం సంచలనం కలిగించింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం గిరిజనుల ప్రాణాలు పోవడానికి కారణంగా కనిపిస్తోంది. నెల రోజులుగా చాపరాయి గ్రామంలో గిరిజనులు జ్వరాలతో తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందుతున్నా పట్టించుకోలేదు. మరణాలు సంభవిస్తున్న విషయం కూడా తెలియదనడం వారి పనితీరుకు నిదర్శనం. వైద్యసేవలు అందని కారణంగా ఇక్కడి 16 మంది గిరిజనులు మృతిచెందగా మరో 30 మందికి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని చాపరాయి గ్రామంలో సుమారు 60 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గుర్తేడు పీహెచ్‌సీ పరిధిలో ఉండే చాపరాయి గ్రామానికి నెల రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించే వైద్యసిబ్బంది ఎవరూ వెళ్లకపోవడంతో విషయం బయటకు రాలేదు. మారుమూల ప్రాంతం కావడంతో గిరిజనులు బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. క్షేత్రస్థాయి వైద్యసిబ్బంది గ్రామాన్ని సందర్శించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా ఈ నెల 24 రాత్రి బయటకు రావడంతో అధికారులు బృందం హుటాహుటిన చాపరాయికి బయలుదేరివెళ్లారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. గ్రామంలో జ్వరాలతో అస్వస్థతకు గురైన మరో 30 మంది గిరిజనులను అంబులెన్స్‌ల్లో రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రితోపాటు మారేడుమిల్లి పీహెచ్‌సీలో చేర్పించారు. ప్రస్తుత వారు వైద్యసేవలు పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అక్కడికి చేరుకొని బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ముఖ్య మంత్రి చంద్రబాబు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.







