UPDATED 4th SEPTEMBER 2017 MONDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రముఖ సిస్కో నెట్ వర్కింగ్ అకాడమీ ఆసియా, ఫసిఫిక్, జపాన్ స్థాయిలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మకమైన నెట్ రైడర్స్ కాంపిటీషన్ లో విశేష ప్రతిభ కనబరిచి ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించినట్లు సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. దేశం మొత్తం మీద ఏడు కేంద్రాలలో నిర్వహించనున్న ఫైనల్ రౌండ్ పోటీలకు మొదటి రౌండ్ పోటీలలో అర్హత పొందిన వారిలో ఐటి ఎస్సెన్షియల్ విభాగం నుంచి 10 మంది, సిసి నెట్ విభాగం నుంచి 10 మంది తమ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు అయన తెలిపారు. సిస్కో నెట్ వర్కింగ్ అకాడమీ తరఫున నెట్ రైడర్స్ ఫైనల్ రౌండ్ పోటీలను తమ కళాశాలలో నిర్వహించేందుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఎంపికైన తమ కళాశాల విద్యార్థులతో పాటు ఆంధ్రప్రదేశ్ లో గల ఇతర కళాశాల విద్యార్థులు ఈ నెల ఆరున నిర్వహించే ఫైనల్ పోటీలకు ఆదిత్య క్యాంపస్ ఆతిధ్యం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదిత్య విద్యా సంస్థలు సిస్కో నెట్ వర్కింగ్ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా సిస్కో నెట్ వర్కింగ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ పరీక్షలకు ఆదిత్య విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చి మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య కళాశాల టెక్నికల్ హబ్ కోఆర్డినేటర్ ఎన్.బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.







