UPDATED 3rd JANUARY 2018 WEDNESDAY 9:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డాక్టర్ వివేక్ కొప్పర్తి వైద్యరంగంలో వ్యవస్థాపకతపై విశేష అనుభవాన్ని గడించి భారతదేశంలోనే కాక అమెరికాలో కూడా ఆధునిక పోకడల ద్వారా కామెర్లకు మందులను, నివారణా చర్యలను అందించడంలో విజయవంతమయ్యారు. ఆయన ఇంజనీరింగ్ విభాగంలో ఈఈఈ, ఎం.బి.ఎ విదేశాల్లో పూర్తిచేశారు. 2016వ సంవత్సరంలో వీరిని అమెరికన్ ప్రభుత్వం వరల్డ్ పోజిటివ్ అవార్డుతో సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ వివేక్ కొప్పర్తి మాట్లాడుతూ శిశువులకు సంక్రమించే కామెర్లకు నిమొనాటల్ అనే సంస్థ ద్వారా వార్షికకాలంలో 3.5 మిలియన్ డాలర్ల మందులను పంపిణి చేస్తున్నామన్నారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి వృత్తి నైపుణ్యత విలువలు పెంపొందించుకుని వ్యాపారరంగాల్లో రాణించాలని సూచించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు ఇటువంటి శిక్షణా తరగతులు వారి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







