అమరావతి (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: గత వందేళ్లలో కనీవినీ ఎరుగని విధంగా ఇటీవల కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నీరు లేక అలమటించే రాయలసీమలో అనూహ్యమైన వరదలను చూశామన్నారు. వర్షాలు, వరదలు.. ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాలపై శాసనసభలో సీఎం మాట్లాడారు. నవంబర్ 16, 17 నుంచి కుండపోత వర్షాలు ప్రారంభమయ్యాయని.. 19న తెల్లవారుజామున కడప జిల్లాలోని పింఛ, అన్నమయ్య రిజర్వాయర్ల కట్టలు తెగిపోయాయన్నారు. ఫలితంగా చెయ్యేరు నదీ పరీవాహక ప్రాంతంలోని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని జగన్ వివరించారు. గొండ్లూరు శివాలయ ప్రాంతంతో పాటు మందపల్లి, నందలూరులో బస్సులు వరదలో చిక్కుకుపోవడం వల్ల ప్రాణనష్టం కూడా జరిగిందన్నారు. వరదల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఎక్కడా దాచిపెట్టలేదని.. కష్టంలో ఉన్నవారికి సహాయం అందించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదని చెప్పారు.







