చైర్మన్ అనర్హత, బంగ్లా అక్రమ వినియోగంపై మరో ఫిర్యాదు
విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి కార్యాలయం
విజిలెన్స్ ఎస్పీ ఆధ్వర్యంలో రత్నగిరిపై విచారణ ప్రారంభం
అన్నవరం (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబరు 2021: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానంలో సోమవారం విజిలెన్స్ అధికారుల తనిఖీలు ప్రకంపనలు రేకెత్తించాయి. దేవస్థానం పాలకమండలి సభ్యుడు ఒకరు రెండు ఫిర్యాదులుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖలు రాశారు. మొదటి ఫిర్యాదులో దేవస్థానంలో వివిధ విభాగాల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని 25 అంశాలను వివరించారు. చైర్మన్‌గా రోహిత్ అనర్హత, నిబందనలకు విరుద్ధంగా బంగ్లా వినియోగించుకున్నట్టు రెండో ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ ఎస్పీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో ఆరోపణలకు సంబంధించి పలు రికార్డులు తనిఖీ ప్రక్రియ ప్రారంభించారు. ట్రస్టీ ఫిర్యాదు చేసిన 25 అంశాల్లో ప్రధానంగా... ఈవో క్వార్టర్, వేద పాఠశాల నిర్మాణం, ఇటీవల 39 మంది వ్రత పురోహితుల నియామకం, అక్రమ పదోన్నతులు, 303 ఎకరాల దేవస్థానం కొండలో ఆక్రమణలు, గొంది గ్రామంలో దేవస్థానానికి చెందిన భూముల కౌలు వేలం, సెంట్రల్ స్టోర్స్‌కు సంబంధించి రస వర్గాల సరఫరా టెండర్ సమయంలో చూపించిన శాంపిల్స్‌కి దేవస్థానానికి చేరే సమయంలో ఇచ్చే సరుకు నాసిరకం సరఫరా, ఎయిడెడ్‌గా జాయిన్ అయిన కొందరు అన్ ఎయిడెడ్‌లో విధులు నిర్వర్తించడం, ఎన్‌ఎంఆర్ పోస్టులో ఒకరికి అక్రమ పదోన్నతి, కొందరికి కోర్టు ఆదేశాలున్నా పదోన్నతి కల్పించకపోవడం, ఈవో, సహాయ కమిషనర్ 6 వీఐపీ గదులను వాడుకోవడం, మోడేకుర్రు వేద పాఠశాలకు నెలకు రూ.60 వేల చొప్పున దేవస్థానం నిధులు మళ్లించడం, హుండీల్లో సమర్పించే పట్టు వస్త్రాలను పక్కదారి పట్టించడం, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు. పదోన్నతులు పొందడం, ఎలక్ట్రికల్ గూడ్స్ కొనుగోలులో భారీ అవకతవకలు, లీజుల విభాగంలో షాపుల కేటాయింపులో భారీ ఎత్తున అక్రమాలు వున్నాయి. వీటన్ని టిపైనా రత్నగిరిపై ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించి విచారణను మరింత వేగవంతం చేస్తామని, 25 అంశాలను లోతుగా పరిశీలించే క్రమంలో మరిన్ని అంశాలు చేరవచ్చని విజిలెన్స్ అధికారులు తెలిపారు. దేవస్థానంలో అక్రమాలు జరిగాయని 2007లో ఒక ట్రస్టీ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయగా 14 ఏళ్ల తర్వాత మరో ట్రస్టీ ఫిర్యాదు చేశాడు. కాగా ఫిర్యాదుదారులు ఇద్దరూ తండ్రీకొడుకులు కావడం విశేషం. విజిలెన్స్ తనిఖీల్లో డీఎస్పీ ముత్యాలనాయుడు, సీఐలు శ్రీనివాసరెడ్డి, సత్యకిషోర్, ఏవో భార్గవమహేష్, తహశీల్దార్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.







