UPDATED 9th FEBRUARY 2022 Wednesday 06:00 AM
మేడారం (రెడ్ బీ న్యూస్): తెలంగాణ రాష్ట్రం అతిపెద్ద జాతరకు సిద్ధమౌతోంది. సమ్మక్క – సారలమ్మ మహా జాతర కోసం మేడారంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకారం చుడతారు. వన దేవత పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో జాతర ప్రారంభం అవుతుంది. అయితే.. మహాజాతరకు వారం రోజుల ముందు జరిగే పూజా కార్యక్రమాలకు మండమెలిగె పేరిట పండుగ నిర్వహిస్తారు. ఇది ప్రారంభం అయితే..మహాజాతర మొదలట్లేనని ఆదివాసీలు భావిస్తారు.
ఈనెల 16 నుంచి నాలుగు రోజులపాటు జరిగే జాతరకు ప్రారంభ సూచికగా పూజారులు మండమెలిగె పండుగను నిర్వహించనున్నారు. దీంతో సమ్మక్క కొలువైన మేడారం, సారలమ్మ వెలిసిన కన్నెపల్లి గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పూర్వం వనదేవతలకు వేర్వేరుగా గడ్డి గుడిసెలలో పూజా మందిరాలు ఉండేవి. రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు ముందు వాటిని తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టేవారు. జాతరకు మూడు వారాల ముందు మొదటి బుధవారం గుడిమెలిగె పండుగ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా పాత గుళ్లను తొలగించేవారు. రెండో బుధవారం నూతన గుళ్ల నిర్మాణాన్ని చేపట్టేవారు. దీనినే మండమెలిగె పండుగగా పూజారులు పిలుచుకుంటారు.







