ముద్రగడ బైక్ ర్యాలీ సక్సెస్

UPDATED 9th JULY 2017 SUNDAY 11:00 AM

కిర్లంపూడి : కాపులను బిసిల్లో చేర్చాలనే డిమాండ్ తో ఛలోఅమరావతి పాదయాత్రకు తరలి రావాలంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిర్వహించిన బైక్ ర్యాలీ ని సక్సెస్ అయింది. మొదట ఈనెల 7వ తేదీన ఏడు మండలాల మీదుగా 30 గ్రామాల వెంట మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించాలని ముద్రగడ అనుచరులు సంకల్పించారు. ఈ విషయం గ్రహించిన జిల్లా పోలీసు అధికారులు ర్యాలీ భగ్నం చేయడానికి ఆదేరోజు కిర్లంపూడిలో భారీగా పోలీసు బలగాలను మోహరింపజేశారు. దీంతో కాపుసంఘాల నాయకులు ఆరోజు చేపట్టదలచిన ర్యాలీని విరమించుకున్నారు. దీంతో అదేరోజు కిర్లంపూడిలో మోహరించిన పోలీసు బలగాలు వెళ్లిపోయారు. దీంతో ముద్రగడ అనుచరులు ర్యాలీ నిర్వహణపై అత్యంత గోప్యత పాటించారు. శనివారం రాత్రి పది గంటల సమయం దాటిన తరువాత అత్యంత విశ్వసనీయమైన వారికి ర్యాలీ నిర్వహణపై సమాచారం అందించారు. ఆదివారం ఉదయం వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారంతా కిర్లంపూడి మండలం సరిహద్దు ప్రాంతంలో కలిసేలా నిర్ణయించారు. ఉదయం 8 గంటలకు కిర్లంపూడి మండలంలోని పలు గ్రామాలనుంచి ముద్రగడ అనుచరులు మోటారు సైకిళ్లపై బయలుదేరి వెళ్లగా వారి వెంట ముద్రగడ అనుసరించారు. పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తం సుమారు 200 మోటారు సైకిళ్లతో ర్యాలీగా బయలు దేరారు. ర్యాలీ వెంట ముద్రగడ, ఆయన అనుచరులు కార్లలో అనుసరించారు. ర్యాలీ పెద్దాపురం మండలం దివిలి, పులిమేరు, గోరింట మీదుగా పిఠాపురం మండలం మల్లాం, జల్లూరు మీదుగా పిఠాపురం పట్టణం చేరుకుని, అక్కడి నుంచి గొల్లప్రొలు నగర పంచాయతీ మీదుగా చిన్నజగ్గంపేట, తాటిపర్తి, బి.ప్రత్తిపాడు, వెల్దుర్తి, దొంతమూరు మీదుగా కిర్లంపూడి మండలం సింహాద్రిపురం చేరుకొని అక్కడి నుంచి జగపతినగరం మీదుగా కిర్లంపూడి చేరుకుంది. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలలో అక్కడి పోలీసులు ర్యాలీ నిలువరించే ప్రయత్నం చేసినా ఎక్కడా ఆపకుండా  నిర్వాహకులు ముందుకు సాగడంతో పోలీసులు ప్రేక్షక పాత్రకే పరమితమయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడంతో ముద్రగడ అనుచరులు రెట్టించిన ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1 గంటకు మోటారు సైకిల్ ర్యాలీ కిర్లంపూడి చేరుకుంది. పెద్దాపురం డీఎస్పీ రాజశేఖరరావు, జగ్గంపేట సీఐ కాశీవిశ్వనాథం, ఇతర పోలీసు అధికారులు స్థానిక పరిస్థితులపై సమీక్షించి, ర్యాలీలో పాల్గొన్నవారి వివరాల కోసం వీడియో పుటేజీలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ర్యాలీలో పాల్గొన్న సుమారు 150 మందితోపాటు ముద్రగడపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us