UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 08:30 AM
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): తెలంగాణకే తలమానికమైన మేడారం జాతర ఏర్పాట్లపై ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. ఈ నెల 16న ప్రారంభం కానున్న జాతర నాలుగు రోజుల పాటు జరుగనుంది. మహాజాతరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హన్మకొండ నుంచి మేడారం వరకు హెలికాప్టర్ నడిపించేందుకు టూరిజం శాఖ ఏర్పాట్లు చేసింది. ఆదివారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి మేడారం జాతరకు భక్తులను తరలించేందుకు హెలిప్యాడ్ సిద్ధం చేసింది.
ఇందుకోసం ఒక్కోక్కరికి 20వేల రూపాయలు చార్జీగా నిర్ణయించారు.ఇక జాతరలో తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై సీఎస్, డీజీపీ దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. జాతరకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు రావొద్దని.. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాలని ఆదేశించారు. తాత్కాలికంగా ఆస్పత్రిని నిర్మించామని, 35 హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. స్నాన ఘట్టాల ఏర్పాటుతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా, నీరు కాలుష్యం కాకుండా నిరంతరం క్లోరినేషన్ చేయనున్నట్లు చెప్పారు.







