అమరావతి (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. బుధవారం ముఖ్యమంత్రి ఆయన భార్య వైఎస్ భారతి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నరు దంపతులు బిశ్వభూషణ్, సుప్రవ హరిచందన్‌లను పరామర్శించారు. కొవిడ్, అనంతర ఆరోగ్య సమస్యలతో గవర్నరు దంపతులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో రెండుసార్లు చేరి చికిత్స పొందారు. పూర్తిగా కోలుకుని ఇటీవలే రాజ్‌భవన్‌కు తిరిగొచ్చిన గవర్నరు దంపతులను ముఖ్యమంత్రి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నామని, విధులను సాధారణంగానే నిర్వహించగలుగుతున్నానని గవర్నరు వారికి తెలిపారు. సుమారు అరగంట పాటు వీరి భేటీ కొనసాగింది. కొన్ని రాజకీయ అంశాలూ గవర్నరు, సీఎంల మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఇతర అధికారులున్నారు.







