Updated 16th April 2017 Sunday 12:10 PM
పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో భారత సేవా సంస్థ సేవలు మరువలేనివని పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు పేర్కొన్నారు. స్థానిక డైలీ మార్కెట్ సెంటర్లో భారత సేవా సంస్థ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత సేవా సంస్థ పట్టణ పరిధిలో పలు ప్రాంతాల్లో పచ్చదనం పరిశుభ్రత లక్ష్యంతో వేలాది మొక్కలు నాటి, వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేసిందన్నారు. అలాగే ప్రతీ సంవత్సరం మంచినీరు, మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఈ సంస్థ సేవలు అందించడం అభినందనీయమన్నారు. సంస్థ గౌరవాధ్యక్షుడు చింతల సత్యనారాయణ మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో చలివేంద్రం నిర్వహణకు రూ. 50 వేలు ఖర్చు అవుతోందని ఈ సొమ్మును దాత బనిశెట్టి నాగేశ్వరరావు సమకూరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ కార్యదర్శి తూతిక రాజు,కౌన్సిల్లర్లు విజ్జపు రాజశేఖర్, గెడ్డం పెదకాపు, వాసంశెట్టి గంగ, బేదంపూడి సత్తిబాబు, సంస్థ సభ్యులు విశ్వనాథం, పరదేశి, లాలం సత్యనారాయణ, పిన్నింటి రాము, నాళం శ్రీనివాసరావు, బుడత సుధాకర్, ఉప్పు రాంబాబు, పెదిరెడ్ల విష్ణు, నీలం పండు, తాడిశెట్టి గంగ, లంక చంటి తదితరులు పాల్గొన్నారు.







