రాష్ట్రవ్యాప్తంగా 27లక్షల యల్.ఇ.డి. బల్బులు ఏర్పాటు

* ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు 
* పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
UPDATED 24th APRIL 2018 TUESDAY 7:00 PM
మండపేట: అక్టోబర్ రెండవ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 27లక్షల యల్.ఇ.డి. బల్బులు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడి గ్రామంలో జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పంచాయితీరాజ్ వ్యవస్థ ఎంతో ముఖ్యమైందని, అయితే దానిలో ప్రజలు భాగస్వౌములు కావాలన్నారు. పంచాయితీలు అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేయడం జరుగుతుందని, ఆత్మగౌరవం పథకం క్రింది రాష్ట్రవ్యాప్తంగా రూ. 4500 కోట్లు వ్యయంతో మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం వోడియఫ్ ప్లస్ పథకాన్ని రూపొందించి తడిపొడి చెత్తలను సేకరించి సంపద సృష్టించడం జరుగుతుందని, అలాగే ప్రతీ గ్రామంలో పశువుల పేడను సేకరించి సేంద్రీయ ఎరువులు తయారుచేసే అందించడం జరుగుతుందని అన్నారు. పట్టణాలలో చెత్త నుండి విధ్యుత్ ను ఉత్పత్తి చేస్తామని తెలిపారు. పంట సంజీవిని పథకం, పంటకుంటలు త్రవ్వించడం ద్వారా భూగర్భజలాలు పెంపొందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రప్రభుత్వం నదుల అనుసంధాన ప్రక్రియకు ప్రాధాన్యత నిచ్చి ముందుకు సాగుతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని దానివలన సాగు, త్రాగునీరు సమస్యలు తొలుగుతాయని అన్నారు. గ్రామీణాభివృద్ధి పథకం క్రింద ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఈ పథకాన్ని 20శాఖలతో సమన్వయపరిచి స్కూలు, అంగన్ వాడీ బిల్డింగులు, రోడ్లు వేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రప్రభుత్వం పౌరసరఫరాలశాఖ ద్వారా అరకిలో పంచదార, కందిపప్పును పేదప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో 50లక్షలమందికి వివిధ రకాల సామాజిక పించన్లు యన్.టి.ఆర్ భరోసా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు రూ. 24వేలకోట్ల ఋణమాఫీ చేయడమే కాకుండా ఒక్కొక్క డ్వాక్రామహిళలకు రూ.10వేలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మట్టి నమూనాలు పరీక్షలు చేయడం, మైక్రోధాతువులను రైతులకు ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు పశువులదాణా 50శాతం రాయితీతో ఇవ్వడానికి చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే సేవారంగాలు అభివృద్ధి చేయాలని, సేవారంగాలు అభివృద్ధి చేయాలంటే పరిశ్రమలు రావాలని అన్నారు. హీరో మోటార్స్ రాష్ట్రంలో శ్రీ సిటిలో ఏర్పాటు చేయుటకు ముందుకు వచ్చారని, దానివలన అనేక మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అదేవిధంగా అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ తమ ప్లాంటును పెట్టడానికి ముందుకు వచ్చారని, ఒక మంచి నిర్ణయంవలన మంచి అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అభివృద్ధికి చిరునామా ఆంధ్రప్రదేశ్ గా గుర్తింపు పొందిందని అన్నారు. అగ్రిగోల్డ్ బాదితులను అన్నివిధాల ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. అవినీతి ఏ రంగాలలో వున్నా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 1600 కిలోమీటర్ల సిసిరోడ్లు గ్రామాలలో వేయడం జరిగిందని, అదేవిధంగా 707 అంగన్ వాడీ భవనాలు నిర్మించడం జరిగిందన్నారు. అలాగే 1800 ఎకరాలలో ఉద్యానవన పంటలు అభివృద్ధి చేయడం జరిగిందని, వ్యవసాయ యాంత్రీకరణ క్రింద 6600 హెక్టార్లలో రూ.35కోట్లు ఖర్చుచేయడం జరిగిందని తెలిపారు. మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు కోరిక మేరకు ద్వారపూడి-జడ్. మేడపాడు గ్రామాలకు చెందిన 1347మంది లబ్దిదారులకు ఇండ్లు మంజూరుచేస్తామని, మండపేటలో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా పెంచుతున్నామని తెలిపారు. అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంతర్గత రోడ్లు, నిర్మాణాల కొరకు రూ. ఆరు కోట్లు, మున్సిపాలిటీకి రూ. నాలుగు కోట్లు, పంగిడి చెరువును ఆధునీకరించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత శ్రీ యన్.టి. రామారావు పరిపాలన వికేంద్రీకరణకు మండలాలు ఏర్పాటుచేసి మారుమూల గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇంటింటికి త్రాగునీరు, మంచినీటి కుళాయిల ద్వారా అందించడానికి రూ.2300 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేస్తుందని, జిల్లావ్యాప్తంగా 750 కిలోమీటర్లు రహదారులు నిర్మించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ స్థానిక సంస్థలలో సర్పంచ్ నుంచి జిల్లాపరిషత్ చైర్మన్ వరకు ప్రతీ ఒక్కరూ ప్రజల భాగస్వామ్యంతో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నామని, పంచాయితీరాజ్ పరిపాలన వ్యవస్థలో ఐ.టి. టెక్నాలజీ జోడించి పంచాయితీ రాజ్ శాఖామంత్రి  నారా లోకేష్ ముందుకు తీసుకుపోవుచున్నారని తెలిపారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహాత్మాగాంధీ స్థానిక సంస్థల అభ్యున్నతి కొరకు ఎంతో కృషిచేశారని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ అంతర్గత రోడ్లు నిర్మాణాలు మరింత చేయవలసిన అవశ్యకత ఉందని అన్నారు. రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా చేయడం వలన ఆర్థికంగా రూ.16వేలకోట్లు లోటుబడ్జెట్ ఉందని, ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 10వేల కిలోమీటర్లు సి.సి.రోడ్లు నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. గత నాలుగు సంవత్సరాలలో రూ.125వేలకోట్లతో 4590 అంగన్ వాడీ భవనాలు నిర్మించామని, జిల్లాలో మూడు లక్షల యల్.ఇ.డి బల్బులు అన్ని గ్రామాలలో ఏర్పాటుచేసి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ సంవత్సరం రూ. రెండు వేల కోట్లతో లింకురోడ్లు అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. రూ. 30కోట్ల వ్యయంతో నిర్మించిన ద్వారపూడి అనపర్తికి వెళ్లే ఫ్లై-ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు. అలాగే ద్వారపూడి- కేశవరం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అలాగే రూ. 22కోట్లతో చేపట్టే తాపేశ్వరం బైపాస్ రోడ్డు, మండపేటలో రూ. కోటితో నిర్మించే షాదీఖానా, రూ. రెండు కోట్లతో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్స్, రూ. రెండు కోట్లతో నిర్మించే స్త్రీశక్తి భవనంకు శంకుస్థాపనలు చేసారు. అలాగే  ద్వారపూడి గ్రామ పంచాయితీ భవనం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాలు శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, అమలాపురం యం.పి. డాక్టర్ పండుల రవీంద్రబాబు, రాజమహేంద్రవరం యం.పి. మాగంటి మురళీమోహన్, శాసనమండలి సభ్యులు కలిదిండి రవికిరణ్ వర్మ, వి.వి.వి.చౌదరి, చిక్కాల రామచంద్రరావు, రాజేంద్రప్రసాద్, శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వర రావు, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు,  పులపర్తి నారాయణమూర్తి, గొల్లపల్లి సూర్యారావు, జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పెందుర్తి వెంకటేష్, తోట త్రిమూర్తులు, వర్మ, వరుపుల సుబ్బారావు, గుడా చైర్మన్ గన్నికృష్ణ, రాజమహేంద్రవరం నగర మేయర్ పంతం రజనీ శేషసాయి, పంచాయితీరాజ్, రూరల్ డవలప్మెంటు సెక్రటరీ కె.యస్.జవహార్ రెడ్డి, కార్యదర్శి బి. రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ కార్తీకేయమిశ్రా, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థలను అన్నిరంగాలలో అభివృద్ది చేసినందుకు తూర్పుగోదావరి, ప్రకాశం, విజయనగరం, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించారు.
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us