UPDATED 27th SEPTEMBER 2022 TUESDAY 09:00 PM
Thirumala Brammotsavalu : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రసారమాధ్యమాలు, పత్రికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చూపాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి మీడియా ప్రతినిధులను కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల మొదటిరోజైన మంగళవారం ఉదయం తిరుమలలోని రాంభగీచా-2 విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించినట్లు చెప్పారు.
ఈ ఏడాది అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు అన్ని విభాగాల ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి మూలవిరాట్టు దర్శనంతోపాటు వాహనసేవల దర్శనం కల్పించేందుకు అన్ని రకాల దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం ధ్వజారోహనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. అదేవిధంగా దాతల సహకారంతో రూ.23 కోట్లతో నిర్మించిన పరకామణి భవనాన్ని బుధవారం ఉదయం సిఎం ప్రారంభించనున్నట్లు తెలియజేశారు.
మీడియా సెంటర్‌లో భోజన సదుపాయంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఫ్యాక్స్, టెలిఫోన్ వసతి కల్పించామని, మీడియా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ కోరారు. టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, పిఆర్వో డా.టి.రవి, ఎపిఆర్వో కుమారి పి.నీలిమ, ఒఎస్డీ శ్రీ నాగేశ్వరరావు, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.







