* రెల్లి కుటుంబాల వారికి పునరావాసం
* ఎమ్మెల్యే చొరవతో గృహనిర్మాణాలు
UPDATED 16th JUNE 2018 SATURDAY 10:30 PM
కరప: తూర్పుగోదావరి జిల్లాలోని కరప మండల ప్రధాన గ్రామంలో 15 కుటుంబాల రెల్లి కులస్థులు ఎన్నో ఏళ్లుగా గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ గ్రామంలోని ప్రధాన రహదారి ప్రక్కన నిర్మించుకుని పూరిపాకలలో నివశిస్తూ ఉండేవారు. ప్రతిరోజు గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించడం, అపరిశుభ్రమైన తమ పూరిపాకలలో నివశిస్తూ తరచూ అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొనడం వారికి పరిపాటి అయ్యేది. పారిశుద్ధ్య పనుల మూలంగా వీరిలోని కొంతమంది మగవారికి మద్యం సేవించే అలవాటు కూడా ఉంది. తమ బ్రతుకుయింతే అని సరి పెట్టుకొని అరకొర సౌకర్యాలతో జీవనం సాగించే ఈ కుటుంబాల వారికి రాష్ట్ర ప్రభుత్వం 2016 సంవత్సరంలో అమలు చేసిన యన్.టి.ఆర్ గృహనిర్మాణ పథకం వారి పాలిట వరంగా మారింది. ఈ 15 రెల్లి కుటుంబాలకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రోత్సహంతో వీరికి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వెనుక ఒకటిన్నర సెంట్లు చొప్పున నివేశన స్థలాలను పట్టాలుగా అందచేశారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.1.50 లక్షల వ్యయంతో గృహనిర్మాణాలను గృహనిర్మాణ శాఖ మంజూరు చేసింది. దీనిలో రూ. 95వేలు రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు అందించిదని, మిగిలిన రూ.55వేలు ఉపాధి హామీ పధకంలో అందచేశారు. ఈ కుటుంబాలకు నిర్మించిన గృహాల ద్వారా వారి జీవన విధానంలో మార్పు వచ్చింది. గ్రామంలో పారిశుద్ధ్యం చేపట్టడంతో బాటు తాము నివశించే ప్రాంతంలో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ఆలోచన వారిలో వచ్చింది. ప్రభుత్వ ప్రోత్సహంతో ఈ పారిశుద్ధ్య కార్మికులకు గృహనిర్మాణాలు చేపట్టారు. ఈ కాలనీలో మౌలిక సదుపాయంలో భాగంగా సి.సి రోడ్లు నిర్మాణం, మంచినీటి సౌకర్యం గ్రామ పంచాయితీ ద్వారా కల్పించారు. అలాగే గృహాలకు విద్యుత్ సౌకర్యం కూడా కల్పించారు. గృహాల పెరటిలో పెంచుకొనడానికి పండ్ల మొక్కలు కూడా అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన గృహాలు తమకు ఆసరాగా ఉన్నాయని, తమ జీవితాల్లో వెలుగులు నింపారని, ఈ కుటుంబాలు అన్నిటికీ మూలంగా ఉన్న 80ఏళ్ల వృద్ధురాలు బంగారు అప్పాయమ్మ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. కాలనీలో ఉంటున్న రాయవరపు సత్తిబాబు తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ తాము గతంలో పూరింటిలో ఉండేవాడినని, ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు ఎంతో బాగుందని, వానలు, పెనుగాలుల సమయంలో ఎంతో ధైర్యంగా ఉండగలుగుతున్నామని తెలిపారు. అదే విధంగా కశింకోట అప్పల నరసింహం తన అభిప్రాయాలు తెలియచేస్తూ ప్రస్తుతం తమ జీవన విధానంలో ఎంత మార్పు వచ్చిందని తమ కుటుంబంలో పిల్లలు కూడా చదువు కొంటున్నారని తెలిపారు. అదే విధంగా బంగారు రాజబాబు మట్లాడుతూ తమకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇచ్చిందని, అదే విధంగా చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ, వృద్ధులకు పింఛన్లు పంపిణీ ద్వారా తమ బ్రతుకులు బాగుపడ్డాయని అన్నారు.







