UPDATED 2nd OCTOBER 2017 MONDAY 3:00 PM
పెద్దాపురం: రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో రూ.15 వేల కోట్ల వ్యయంతో 10 లక్షల పక్కా గృహాల నిర్మాణం చేపట్టడమే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి స్వచ్ఛతే సేవ, సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా విచ్చేసి సోమవారం మాట్లాడారు. గృహనిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు అని, 1984లో తాటాకుపాకలు ఉండేవని, వాటిని తొలగించి రూ. 6 వేలతో గృహాలను నిర్మించడం జరిగిందన్నారు. ఆ తర్వాత నుంచి ప్రభుత్వం రూ.40 వేల నుంచి రూ.70 వేలు పథకం, ఇపుడు రూ. 1.50 లక్షల పథకంతో పేదలకు సొంత భవనాలు నిర్మించి ఇవ్వడం జరుగుతోందన్నారు. స్వచ్ఛత విషయంలో విదేశాలతో పోలిస్తే మన దేశం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, పౌరుల భాగస్వామ్యం ఉన్ననాడే స్వచ్ఛతను సాధించగలమన్నారు. మనలో చాలా మంది తమ ఇళ్లను శుభ్రం చేసుకోవడం తప్ప పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన ఉండదన్నారు. ప్రజా ప్రతినిధులు పాలసీని తయారు చేస్తే దానిని అధికారులు అమలు చేస్తారని, అది విజయవంతం కావాలంటే అందుకు ప్రజల సహకారం ఎంతో అవసరం అన్నారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ గడిచిన మూడేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల 80 శాతం పైబడి ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. అనంతరం శాసన మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని, గాంధీ కన్న కలలను సాకారం చేసేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ దేశప్రజల్లో పరిసరాల పరిశుభ్రత పట్ల స్వచ్ఛతే సేవ కార్యక్రమాలు ఎంతో చైతన్యం నింపాయన్నారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలోసర్పంచ్ లు, అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి వల్ల తూర్పుగోదావరి జిల్లా స్వచ్ఛ జిల్లాగా నిలవనుందని, ఈ లక్ష్యాన్ని త్వరలో చేరుకుంటామన్నారు. అనంతరం స్వచ్ఛఆంధ్ర అవార్డులు అందుకున్న స్థానిక సంస్థలు, అసోసియేషన్స్ లు పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రులు, మొదలైన వాటికి మంత్రుల చేతుల మీదుగా పురస్కారాలు అందచేశారు. అలాగే కౌశల్ గోదావరి కార్యక్రమం ద్వారా 450 మంది యువతీ, యువకులను ఎనిమిది ప్రత్యేక బస్సుల్లో శిక్షణకు పంపించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ సి లు ఆదిరెడ్డి అప్పారావు, చిక్కాల రామచంద్రరావు, జాయింట్ కలెక్టర్లు మల్లికార్జున, రాధాకృష్ణ మూర్తి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, హౌసింగ్ పిడి జి.వి.ప్రసాద్ , డీఆర్డీఏ పిడి మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.







