* దేశంలో ఏ చట్టం ప్రకారం ఇలా చేస్తున్నారు?
* హీరోయిజానికి ఇది సినిమా కాదు
* యధేచ్చగా మానవహక్కుల ఉల్లంఘన
* పోలీసుల ఓవర్ యాక్షన్
UPDATED 25th MAY 2018 FRIDAY 6:00 PM
రెడ్ బి న్యూస్ : సాక్షాత్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు వెలువరించినా పోలీసులకు లెక్కలేదు. పోలీస్ స్టేషన్లో యధేచ్చగా హక్కులు ఉల్లంఘనలు కొనసాగుతునే ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవల జరిగిన పలు కేసుల్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి తామేదో హీరోయిజం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో దాఖలైన కేసులు, దర్యాప్తు, నిందితుల అరెస్ట్ విషయంలో పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. పోలీస్ యూనిఫామ్ ధరించిన తర్వాత విధి నిర్వహణను బాధ్యతగా నిర్వర్తించాలి కానీ కేసులో నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి ఏదో హీరోయిజం చేసినట్లుగా భావించడానికి ఇది సినిమానో లేక కాల్పనిక కధో కాదు అని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే ఆదేశించింది. అయితే పోలీస్ స్టేషన్లలో మాత్రం దాఖలైన కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టడం మానవ హక్కులను ఉల్లంఘించడమేనని పలువురు మానవహక్కుల నేతలు అంటున్నారు. ఎఫ్.ఐ.ఆర్ లో నిందితులుగా పేర్కొన్న వారిని దేశంలో ఏ చట్టం ప్రకారం మీడియా ముందు ప్రవేశపెడుతున్నారు.? నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత సంబంధిత ప్రాంతానికి చెందిన మేజిస్ట్రేట్ ముందు మినహా ఇతరుల ముందు హాజరుపర్చకూడదు అని రాష్ట్ర హైకోర్ట్ తీర్పు వెలువరించడం కూడా జరిగింది. నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెడితే వారు నిర్దోషులుగా నిర్ధారణ అయిన తర్వాత సైతం వారిని దోషులుగా భావించే అవకాశం ఉందని కోర్ట్ అభిప్రాయపడింది. మెజిస్ట్రేట్ లేదా సంబంధిత అధికారి మినహా థర్డ్ పార్టీ ముందు ఎలా ప్రవేశపెడతారు ? కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని దోషులుగా ఎలా నిర్ధారిస్తారు? ఇది మానవహక్కులు, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లఘించడమే అని సాక్షాత్తూ అత్యున్నత న్యాయస్థానాలు ఆదేశించాయి. ఐతే ఈ విషయాలు పోలీసులకు తెలిసి చేస్తున్నారా, లేక తెలియక చేస్తున్నారా ఆని పలువురు మానవ హక్కుల నేతలు చర్చించుకుంటున్నారు. ఒకవేళ తెలిసి చేస్తే అది ముమ్మాటికి కోర్ట్ ధిక్కారం కిందే వస్తుంది. ఈ విషయమై ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ నిర్వహించాలని పలువురు మానవహక్కుల నేతలు కోరుతున్నారు.







