* పారిశుధ్య కార్మికులపై ఎస్ఐ వీరంగం
* ఇదేం న్యాయం అని ప్రశ్నించడంతో రెచ్చిపోయిన ఎస్ఐ కృష్ణభగవాన్
* అసభ్య పదజాలంతో మహిళా కార్మికులపై దూషణలు
* ఆందోళనకు దిగిన పారిశుధ్య కార్మికులు
* సిఐ జోక్యంతో సద్దుమణిగిన వివాదం
UPDATED 24th AUGUST 2018 FRIDAY 8:00 PM
పెద్దాపురం: చేతిలో లాఠీ, తలపై టోపీ ఉందికదా అని తాను ఏం చేసినా చెల్లిపోతుందని అనుకున్నాడో ఏమో తన ప్రతాపం పారిశుధ్య కార్మికులపై చూపించాడు పెద్దాపురం ఎస్ఐ ఎ. కృష్ణభగవాన్. పైగా ఇదేం న్యాయం అని ప్రశ్నించిన పాపానికి పారిశుధ్య కార్మికుడిపై దాడికి దిగడమే కాకుండా మహిళా పారిశుధ్య కార్మికులను రాయలేని భాషలో వారిని అసభ్యంగా దూషించి భయాందోళనకు గురిచేశాడు. దీంతో పారిశుధ్య కార్మికులు మన్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు. తమకు ఎస్ఐ క్షమాపణలు చెప్పాలని, పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ ధర్నాకు దిగడంతో దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళితే పెద్దాపురం మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులు రోజులాగే తమ విధులను నిర్వర్తించేందురు పట్టణ శివారులో ఉన్న ప్రసన్నఆంజనేయనగర్ వరకు ట్రాక్టరుపై బయలుదేరి వెళ్తున్నారు. అదే సమయంలో అటుగా వెళ్లుతున్న ఎస్ఐ కృష్ణభగవాన్ వారిని చూసి ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. ట్రాక్టరుపై ఇంతమంది ప్రయాణం చేస్తారా అంటూ బూతు పురాణం లంకించుకున్నారు. దీంతో కార్మికులు భయపడి తాము విధులు నిర్వర్తించేందుకు వెళ్తున్నామని చెప్పినా వినకుండా ట్రాక్టరుపై ఉన్న కార్మికుడిని క్రిందకు లాగి తన లాఠీకి పని చెప్పారు. వి. నాగదుర్గా ప్రసాద్ అనే కార్మికుడిని లాఠీతో కొట్టడంతో అతని కాలికి గాయమయ్యింది. అంతేకాకుండా మహిళా పారిశుధ్య కార్మికులను రాయలేని భాషలో ఎస్ఐ బూతులు తిట్టడంతో వారు సిగ్గుతో మౌనంగా భరించారు. ఎంత బ్రతిమలాడినా వినకుండా ఫోటోలు తీసి వారిని భయాందోళనలకు గురిచేయడంతో అవమానభారంతో కుంగిపోయారు. అంతే కాకుండా మీపై కేసు రాసి లోపలేస్తాను, ఎవడొస్తాడో చూస్తా అంటూ వారిపై రెచ్చిపోయి తన ప్రతాపం చూపించడంతో పారిశుధ్య కార్మికులు మిన్నకుండిపోయారు. దీంతో కార్మికులంతా కలిసి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో సిఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ పారిశుధ్య కార్మికులతో మాట్లాడి చర్చలు జరపడంతో వారు శాంతించారు. ఈ విషయమై ఎస్ఐ కృష్ణభగవాన్ వివరణ కోరగా తాను ఎవరినీ కొట్టలేదని, అసభ్యంగా ప్రవర్తించలేదని, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని మందలించానని అన్నారు.







