విజయవాడ (రెడ్ బీ న్యూస్) 25 డిసెంబర్ 2021: ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరో వైద్యురాలు విజయవాడ పడమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణాజిల్లా మైలవరంలోని సాయిదీప్ ఆసుపత్రికి చెందిన వైద్యుడు కృష్ణకిశోర్ తనను వేధిస్తున్నాడని మహిళా వైద్యురాలు ఫిర్యాదులో తెలిపారు. గతంలో తామిద్దరం కలిసి ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో .. పెళ్లి చేసుకోవాలని కృష్ణకిశోర్ కోరాడని, అందుకు తాను నిరాకరించినట్టు తెలిపారు. ఒక రోజు ఇంటికి వచ్చి బలవంతంగా తాళికట్టేందుకు ప్రయత్నించాడని, అక్కడితో ఆగకుండా ఫోన్‌లో బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కక్ష పెంచుకున్న కిశోర్ .. తనను వేధించడంతో పాటు తన భర్తను చంపేస్తానంటూ వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆమె పోలీసులకు వివరించారు. ఒంటరిగా కలవాలని, తాను చెప్పిన చోటుకి రావాలని ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పడమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







