UPDATED 8th JANUARY 2018 MONDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ ప్రతిష్టాత్మకమైన స్పెయిన్ యూనివర్సిటీ రోమన్ లోల్ తో ఎంవోయూ ఒప్పందం చేసుకున్నట్లు డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యున్నత ప్రమాణాలు, నూతన టెక్నాలజీని అందించే యూనివర్సిటీ తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని, విద్యార్థులు తమ ఆలోచనలను మెరుగుపరుచుకొనేందుకు, నూతన ఆవిష్కరణలు చేసుకునేందుకు, నూతన పరిజ్ఞానంతో ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రోమన్ లోల్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ కార్లస్ మోస్ లార్స్ మాట్లాడుతూ భారతదేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలుగా పేరెన్నికగన్న ఆదిత్యతో ఎంవోయూ ఒప్పందం తాము ఎంతో గౌరవంగా భావిస్తున్నామని, ఈ ఒప్పందం ద్వారా తమ యూనివర్సిటీలో మెరుగైన విద్యాప్రమాణాలతో కూడిన విద్యను అభ్యసించేందుకు ఇక్కడి అధ్యాపకులు, విద్యార్థులకు వీలవుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 110 యూనివర్సిటీలతో తమ సంస్థ ఎంవోయూ ఒప్పందం చేసుకుందన్నారు. ప్రొఫెసర్ బాలచరణ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా యూనివర్సిటీ వివరాలను ప్రదర్శించారు. స్పెయిన్ యూనివర్సిటీ ప్రతినిధుల బృందం ఆదిత్య క్యాంపస్ లో గల లైబ్రరీ, ల్యాబ్, తరగతి గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆదిత్య యాజమాన్యం స్పెయిన్ యూనివర్సిటీ ప్రతినిధి బృందాన్ని జ్ఞాపిక, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







