-పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనుల తీరుపై సంతృప్తి
-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
UPDATED 7th AUGUST 2017 MONDAY 7:00 PM
రాజమహేంద్రవరం: ఆగస్టు 15 నాటికి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు ఆయకట్టుకు నీరందిస్తామని, ఈ ఏడాదిలోగా ఏలేరుకు రోజుకు 1,400 క్యూసెక్కుల నీటిని తరలిస్తామని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు హెలికాఫ్టర్‌లో సీతానగరం డిగ్రీ కళాశాల ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థినులు, మహిళలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా నేతలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కొద్దిసేపు సమావేశమై అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. తొలుత జలవనరుల శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎక్సిబిషన్ ని తిలకించి, ఎత్తిపోతల పథకం ప్రస్తుత స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంపుహౌస్, రెగ్యులేటర్, ఫ్యాబ్రికేషన్ పనులు జరుగుతున్నతీరును పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత రబీకి పూర్తి స్థాయిలో నీరిచ్చిన ఘనత తమకే దక్కుతుందని, ఎప్పుడూ లేని విధంగా ఇచ్చిన హామీ మేరకు జూన్ ఒకటో తేదీన గోదావరి డెల్టాకు నీటిని సరఫరా చేసి రైతులను సాగుకు సన్నద్ధం చేసే అదృష్టం తమకు దక్కిందన్నారు. గోదావరి జలాలు వృథాగా పోకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా కుడి కాలువ (ఆర్‌ఎంసీ) ద్వారా కృష్ణా జిల్లా ఆయకట్టుకు నీరిచ్చేందుకు పట్టిసీమ, ఏలేరు ఆయకట్టుతో పాటు పీబీసీ, విశాఖపట్నం తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మెట్టలో శివారు ఆయకట్టుకు ఇంకా నీరందని పరిస్థితి ఉందని, అందుకోసం మరో రెండు ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఏజెన్సీలో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైతే అక్కడా రెండు పథకాల ఏర్పాటుపై ఆలోచిస్తామన్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతానికి సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంతో గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి మభ్యపెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో రైతుల తరఫున తాను పోరాడానని గుర్తుచేశారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాల నిర్మాణానికి భూసేకరణ విషయంలో సహకరించిన రైతులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. కొందరు స్వార్థపరులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా తొలి విడతలో 67 వేల ఎకరాల ఏలేరు ఆయకట్టుకు, రెండో దశ పూర్తి చేసి రెండు జిల్లాల పరిధిలో 2.15 లక్షల ఎకరాలకు సాగు నీటితో పాటు ఏలేరులో 24 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నీటిని ఉంచుతామన్నారు. కాటన్ మహాశయుని వల్ల గోదావరి జలాలు జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నాయని, నీళ్లే నాగరికతను నేర్పుతాయన్నారు. గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతూ జిల్లా రైతాంగానికి అవసరమైనప్పుడు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను అధిగమించేందుకే ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాటన్ స్ఫూర్తిని కొనసాగిస్తూ వృథా జలాలను మరింత ఒడిసి పట్టి సాగు, తాగు, ఇతర అవసరాలకు వినియోగించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని చంద్రబాబు తెలిపారు. పర్యాటక రంగానికి సంబంధించి జిల్లాలో అపార వనరులున్నాయని, ఓవైపు కోనసీమ, కాకినాడ, మన్యసీమ, పాపికొండలు ఎంతో ప్రకృతి రమణీయంగా ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం పనులు సైతం దాదాపు పూర్తవుతున్ననేపథ్యంలో విదేశీ పర్యాటకులను కూడా ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం మంచి పనులు చేస్తున్నప్పుడు అందరూ సహకరించాలని కోరారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు రోడ్డు మార్గంలో సీతానగరంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌లో పోలవరం వెళ్లారు. ఈ సందర్భంగా డీఐజీ రామకృష్ణ, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ రాజకుమారి పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ మురళీమోహన్, శాసన మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు కార్తికేయ మిశ్రా, కె.భాస్కర్, జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్, ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, వర్మ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పిల్లి అనంతలక్ష్మి, పి.నారాయణమూర్తి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, రాజమహేంద్రవరం మేయర్ పి.రజనీశేషసాయి, ఇన్‌ఛార్జి సబ్‌కలెక్టర్ విజయ్‌రామరాజు, ఐటీడీఏ పీఓ దినేష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.







